మందమర్రి రూరల్ : సారవంతమైన భూముల్లో నల్లటి మట్టిని వేసి జీలుగ విత్తనాలు (Cumin seeds ) సాగు చేస్తే పంటల దిగుబడులు సాధించవచ్చని చెన్నూరు సహాయ వ్యవసాయ సంచాలకులు బాణోత్ ప్రసాద్ అన్నారు. బుధవారం మండలంలోని సండ్రోన్పల్లి గ్రామం రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైతులు మట్టిని వేసే బదులు నేల స్వభావాన్ని బట్టి పచ్చిరొట్టె ఎరువుల సాయంతో సారవంతంగా మార్చుకోవచ్చని సూచించారు.
దీని కోసం రైతులు అందుబాటులో ఉన్న జీలుగ విత్తనాలను సాగు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. మందమర్రి మండలానికి 473 జీలుగా బస్తాలు రాగా, ఇప్పటివరకు 150 బస్తాల పంపిణీ చేశామని వివరించారు. ఒక్కో బస్తా 30 కిలోల పరిమాణం కలిగి రెండు నుంచి రెండున్నర ఎకరాలలో పచ్చిరొట్టగా సాగు చేసుకోవచ్చని తెలిపారు. మండలంలోని ప్రతి వరి సాగు చేస్తున్న రైతు తప్పనిసరిగా జీలుగను పచ్చిరొట్టగా వినియోగించాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి కిరణ్మయి, విస్తరణ అధికారి ముత్యం తిరుపతి, రైతులు పాల్గొన్నారు.