భైంసా, ఏప్రిల్ 17 : పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో డాక్టర్ కాశీనాథ్ సీపీఆర్ చేసి ఒకరి ప్రాణాలు కాపాడారు. ముథోల్కు చెందిన శోభ తన కూతురిని సోమవారం భైంసా ఏరియా దవాఖానకు తీసుకొచ్చింది. ఈ క్రమంలో శోభ అపస్మారక స్థితికి వెళ్లడం, గుండెపోటు రావడంతో అక్కడున్న వారు గమనించి కేకలు వేశారు.
వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ కొన్ని క్షణాల్లోనే శోభకు సీపీఆర్ చేశారు. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఆమెకు చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ కాశీనాథ్తో పాటు డాక్టర్ మేఘన, సిబ్బంది సతీశ్, రోహిదాస్ను పలువురు అభినందించారు.