మంచిర్యాల (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/చెన్నూర్, జూన్ 30 : చెన్నూర్ మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యులను ఎంపిక చేయడానికి స్థానిక శాసన సభ్యుడు, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఓ వైపు తర్జన భర్జన పడుతుండగా, మరో వైపు అప్పటికే ఎంపిక చేసిన వ్యక్తిపై చైర్పర్సన్ భర్త అభ్యంతరం వ్యక్తం చేయడం ఆయన(మంత్రి)కు మరింత ఆగ్రహం తెప్పించింది. చెన్నూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఎక్కువ మందిని కౌన్సిలర్లను గెలుచుకొని చైర్ పర్సన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్న విషయం విదితమే.
మున్సిపాలిటీ పాలకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సగం కంటే ఎక్కువ కౌన్సిలర్లు ఉండగా, కో ఆప్షన్ సభ్యులు కూడా కాంగ్రెస్ వారే ఎన్నికవుతారు. దీంతో పార్టీలో కో ఆప్షన్ పదవులను ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండగా, రాని వారి నుంచి తీవ్రంగా అసంతృప్తి వ్యక్తమవుతుందని భావించిన మంత్రి వివేక్.. కో ఆప్షన్ సభ్యుల నియామకాన్ని ఇన్ని రోజలు వాయిదా వేస్తూ వచ్చారు. ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగియున్న ఇద్దరు సభ్యులు, అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన ఇద్దరు సభ్యులను కో ఆప్షన్ సభ్యులుగా నియమించాల్సి ఉంటుంది.
ఇందుకు సం బంధించి గతంలోనే మున్సిపాలిటీ వారు నోటిఫికేషన్ జారీ చేయగా, మంత్రి వివేక్ సూచించిన నలుగురితో పాటు ఇతరులు కలిపి మొత్తం 17 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరం తా కాంగ్రెస్కు చెందిన వారే కాగా, ఇందులో అల్ప సంఖ్యాక వర్గాల (మైనార్టీ) కోటాలోని జనరల్ స్థానానికి పోటీ ఎక్కువ ఉండగా, ముందుగా మంత్రి నిర్ణయించిన పేరును మిగితా మైనార్టీ నాయకులు వ్యతిరేకించారు. మైనార్టీ కోటాలో ముందుగా మంత్రి నిర్ణయించిన అత ను ఇటీవల కాంగ్రెస్లో చేరడం, అతనికే గత మున్సిపాలిటీలో కౌన్సిలర్ టికెట్ ఇవ్వగా ఓడిపోయారు.
అయితే అతనికే తిరిగి మైనార్టీ కోటాలో కో-ఆప్షన్ పదవి ఇవ్వాలని నిర్ణయించడంతో మొదటి నుంచి పార్టీలో పని చేస్తున్న మిగితా మైనార్టీలు వ్యతిరేకించారు. దీంతో ఇన్ని రోజుల పాటు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ రోజు (మంగళవారం) కాంగ్రెస్కు చెందిన కౌన్సిలర్లతో మంత్రి వివేక్ వెంకటస్వామి తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పిలుపించుకొని అంతరంగిక సమాశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మైనార్టీ జనరల్ కోటాలో కో ఆప్షన్ పదవిని ఆశిస్తున్న వారిని పిలిపించి వారితో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కో ఆప్షన్ పదవి ఆశిస్తున్న సహీర్ఖాన్, అతీ ఫ్, సుల్తాన్ పేర్లతో లాటరీ తీస్తామని.. ఎవరి పేరు వస్తే వారిని కో ఆప్షన్ సభ్యుడిగా ఎంపిక చేస్తామి చెప్పినట్టు తెలిసింది. దీంతో వారు ఒప్పుకోవడంతో మంత్రి వివేక్నే స్వయంగా పేర్లు రాసి చీటీలు వేయగా, అక్కడే ఉన్న చైర్ పర్సన్ పద్మ చీటీ తీశారు. సహీర్ పేరు రావడంతో అతడిని కో ఆప్షన్ సభ్యునిగా ఎంపిక చేశారు.
చైర్పర్సన్ భర్తపై మంత్రి ఆగ్రహం
ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగియున్న కోటాలో ఇప్పటికే ఒక వ్యక్తిని మంత్రి వివేక్ ఎంపిక చేయగా, ఆ పేరును చైర్పర్సన్ భర్త వ్యతిరేకించినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై మంత్రి వివేక్.. ఆ పేరు ఉంటే నీకు ఏమి ఇబ్బంది అంటూ చైర్పర్సన్ భర్తపై కోపానికి వచ్చినట్లు తెలిసింది. అంతేగాకుండా చైర్పర్సన్ పదవి కోసం తనకు రూ. 5 కోట్లు ఇచ్చానంటూ చెప్పుకుంటున్నావట కదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంచిర్యాలలోని తన వ్యతిరేక వర్గం వద్ద కూడా ప్రచారం చేస్తున్నావంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇంత మంది ఉండగా నీకు పదవి ఇస్తే.. ఇలా నా పైనే అసత్య ప్రచారం చేస్తావా? అం టూ కాపానికి వచ్చి నట్లు తెలిసింది. ఈ విషయాన్నంతా మంత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నవారు బయటకు వచ్చిన తర్వాత చర్చించుకుంటున్నారు. దీంతో చైర్పర్సన్ భర్తపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం బహిర్గతమైంది.