మంచిర్యాల, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పారదర్శంగా ముందుకెళ్లాల్సిన మున్సిపల్ అధికారులే నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సామాన్యులు ఇళ్లుకట్టుకుంటే అది లేదు.. ఇది లేదు.. అంటూ కఠినంగా వ్యవహరిస్తుండగా, అదే పెద్దల విషయంలో మాత్రం రూల్స్ పక్కన పెట్టి అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. చట్టం అందరికీ సమానమేనని.. తప్పు చేసిన వారెవరైనా వదిలిపెట్టబోమని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ప్రకటించిన విషయం విదితమే.
కానీ.. అదే చట్టం కొందరికి కఠినంగా మారగా, మరికొందరికి చుట్టమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులు, ప్రతిపక్ష పార్టీ నాయకుల విషయంలో ‘రూల్ ఈజ్ రూల్’ అంటూ వేదాలు వల్లిస్తున్న అధికారులే.. నిబంధనలు ఉల్లంఘించి మరీ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేసి హడలెత్తించిన నన్పూర్ మున్సిపాలిటీ అధికారులే ఓ లే-అవుట్ విషయంలో మాత్రం నిబంధనలు పాటించకపోవడం గమనార్హం.
నిబంధన ఏం చెబుతుంది. ఏం చేశారు
నస్పూర్ మున్సిపాలిటీ తీగలపాడు రెవెన్యూ విలేజ్ పరిధిలోని సీతారాంపల్లిలో సర్వే నంబర్లు 16, 38, 39లో డీటీసీపీ లే-అవుట్ అప్రూవల్ కోసం కొందరు దరఖాస్తు చేసుకున్నారు. టెంటేటివ్ అప్రూవల్ రావడంతో లే-అవుట్లను డెవలప్ చేశారు. కానీ ఫైనల్ లే-అవుట్ అప్రూవల్ రాకుండానే నాలుగు ప్లాట్లలో భవన నిర్మాణాలు చేశారు. ఈ విషయమై లే-అవుట్ నిర్వాహకులను వివరణ కోరితే డీటీసీపీ ఫైనల్ లే-అవుట్ అప్రూవల్ రావాల్సి ఉందని చెప్పారు.
భవన నిర్మాణాలకు మాత్రం మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. కానీ టెంటేవిల్ లే-అవుట్ పర్మిషన్ నిబంధనల ప్రకారం ఫైనల్ లే-అవుట్ అప్రూవల్ రాకుండా నిర్మాణాలు చేయొద్దు కదా అని ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పకుండా బయట ఉన్నామని.. తర్వాత మాట్లాడుతానని దాటవేశారు. దీనిపై మున్సిపాలిటీలో ఆరా తీస్తే.. టెంటేవిట్ లే-అవుట్ నిబంధన-8ను తుంగలోకి తొక్కి పర్మిషన్ ఇచ్చినట్లు తెలిసింది. నిబంధన-8 ఏం చెబుతుందంటే “మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్”కు లే-అవుట్లో మార్టిగేజ్ చేసిన ప్లాట్లలో కానీ, మిగిలిన ప్లాట్లలో కానీ ఫైనల్ లే-అవుట్ అప్రూవల్ రాకుండా ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు. కానీ ఇక్కడ మాత్రం ఫైనల్ లే-అవుట్ అప్రూవల్ లేకుండానే 4 బిల్డింగ్‌లకు ఈ ఏడాది ఏప్రిల్‌లో పర్మిషన్ ఇచ్చారు.
రిజెక్ట్ చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు
టెంటేటివ్ అప్రూవల్ వచ్చిన లే-అవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన కొందరు జీ+1 భవన నిర్మాణాల కోసం మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఫైనల్ లే-అవుట్ అప్రూవల్ రాకుండా పర్మిషన్ ఇవ్వడం కుదరదని వాటిని రిజెక్ట్ చేశామని, టౌన్ ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. కానీ తమ ప్రమేయం లేకుండానే కమిషనర్ తిరిగి ఆ బిల్డింగ్‌లకు పర్మిషన్ ఇచ్చారని చెబుతున్నారు. ఇదేలా సాధ్యమైందని మున్సిపల్ కమిషనర్ సతీశ్‌ను సోమవారం వివరణ కోరగా.. రేపు మా టౌన్ ప్లానింగ్ అధికారి వచ్చాక కలవండి వివరంగా చెబుతారని తెలిపారు.
పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు, ఫైనల్ లే-అవుట్ అప్రూవల్ రాకుండానే వాటికి పర్మిషన్ ఇచ్చినట్లు తెలిసింది అని అడగ్గా.. అది ఎక్కడి లే-అవుట్.. నాకు అవగాహన లేదని, మా టీపీవో వచ్చాక చూసి చెబుతారని దాటవేశారు. మీరే పర్మిషన్ ఇచ్చారంట సార్.. మీకు తెలియదా అంటే ఏమున్నా మా టౌన్‌ప్లానింగ్ అధికారి వచ్చాకే చెబుతామని, రేపు రమన్ని చెప్పారు. మంగళవారం మరోసారి వెళ్లగా టౌన్‌ప్లానింగ్ అధికారి విధులకు రాలేదు. వారంలో మూడు రోజులు ఇక్కడ, మరో మూడు రోజులు వేరే జిల్లాలో ఆయన పని చేస్తారని.. ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదని మున్సిపల్ సిబ్బంది చెప్పారు. ఈ విషయంపై కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేయగా ఆయన ఫోన్ కలవలేదు.
అక్రమ నిర్మాణాలున్నా.. ఫైనల్ లే-అవుట్ అప్రూవల్
మున్సిపల్ అధికారుల బాగోతం పక్కన పెడితే.. నిబంధనలు ఉల్లంఘించి, అక్రమ నిర్మాణాలు చేసినా దానికి జిల్లా ఉన్నతాధికారి ఫైనల్ లే-అవుట్ అప్రూవల్ ఇవ్వడం గమనార్హం. డీటీసీపీ కమిటీ పరిశీలనలో రెండు శాఖల ఉన్నతాధికారులు ఇక్కడ అక్రమ నిర్మాణాలున్నట్లు తమ ఎన్వోసీలో క్లీయర్‌గా పేర్కొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి తమ ఎన్‌వోసీల్లో ఈ విషయాన్ని క్లీయర్‌గా మెన్షన్ చేశారు. కానీ ఇవేవి పరిగణలోకి తీసుకుండా జిల్లా ఉన్నతాధికారి ఫైనల్ లే-అవుట్ అప్రూవల్‌కు సిఫార్సు చేయడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఫైనల్ లే-అవుట్ అప్రూవల్ లేకుండా మున్సిపల్ కమిషనర్ బిల్డింగ్‌లకు పర్మిషన్ ఇస్తారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఉన్నతాధికారులు ఫైనల్ లే-అవుట్ అప్రూవల్ ఇస్తారు. ఇదెక్కడి చోద్యం అంటూ స్థానికులు వాపోతున్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన లే-అవుట్‌పై చర్యలు..?
సొంత స్థలాల్లో మా కష్టార్జితంతో కట్టుకున్న ఇళ్లకు నోటీసులు ఇచ్చిన అధికారులు ఈ లే-అవుట్ విషయంలో నిబంధనలు ఎందుకు పాటించలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఫైనల్ లే అవుట్ అప్రూవల్ ఈ ఏడాది ఆగస్టులో వస్తే, బిల్డింగ్‌లకు ఏప్రిల్‌లో ఎలా పర్మిషన్ ఇచ్చారు. పైనల్ లే-అవుట్ అప్రూవల్ లేకుండా ఈ ఏడాది ఏప్రిల్‌లో బిల్డింగ్‌లకు పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకుంటారా.. లేకపోతే అధికారులు నిబంధనలు పాటించకున్నా పర్లేదని వదిలేస్తారా అనేది తేలాల్సి ఉంది. టెంటేటివ్ లే-అవుట్ రూల్స్ పాటించకుండా వాయిలేషనే చేసినందుకు తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 సెక్షన్ 172(15)ను అనుసరించి లే-అవుట్‌కు ఇచ్చిన పర్మిషన్లు రద్దు చేయాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అధికారులు టెంటేటివ్ లే-అవుట్ రూల్స్‌ను ఉల్లంఘించిన మున్సిపల్ అధికారులతో పాటు లే-అవుట్ నిర్వాహకులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, జిలా ఉన్నతాధికారులు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.