దస్తురాబాద్, ఆగస్టు 7 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి తీర ప్రాంతాలు, వాగుల వరద ఉధృతికి విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నది. ఆ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. దస్తురాబాద్ మండలంలోని గోదావరి తీర ప్రాంతాలైన దేవునిగూడెం, రాంపూర్, భూత్కూర్, గొడిసేర్యాల, గొడిసేర్యాల గోండుగూడెం, మున్యాల తదితర తీవ్రత అధికంగా ఉన్నది. శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టుల నుంచి వరద రావడంతో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫ్మార్లు కొట్టుకుపోయాయి. మొత్తంగా 60 స్తంభాలు, 20 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. రైతుల పంట పొలాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు మరమ్మతులు వేగంగా పూర్తిచేస్తున్నారు. దెబ్బతిన్న స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ట్రాన్స్ఫ్మార్లకు మరమ్మతులు చేపడుతున్నారు.
కొనసాగుతున్న పనులు..
రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సర్కారు.. వర్షాలతో దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆ శాఖ అధికారులకు సూచించింది. గోదావరి తీర ప్రాంత రైతుల పంట పొలాలకు త్వరితగతిన విద్యుత్ అందించాలని తెలిపింది. ఈ మేరకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభించారు. మున్యాల, రాంపూర్, గొడిసేర్యాల, భూత్కూర్ తదితర గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దాదాపు 40 నూతన స్తంభాలును ఏర్పాటు చేశారు. 5 ట్రాన్స్ఫార్మర్లకు స్థానిక సిబ్బంది మరమ్మత్తులు చేశారు. 10 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతుల కోసం నిర్మల్ జిల్లా కేంద్రానికి తరలించారు. ఇంకా 5 విద్యుత్ నియంత్రికలకు మరమ్మతులు చేయాల్సి ఉన్నది. రైతుల పంటల సాగుకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు అధికారులు ముందుకు సాగుతున్నారు.
10 లోగా విద్యుత్ పునరుద్ధరిస్తాం..
మండలంలోని గోదావరి తీర ప్రాంతాలైన దేవునిగూడెం, రాంపూర్, భూత్కూర్, గొడిసేర్యాల, గొడిసేర్యాల గోండుగూడెం, మున్యాల తదితర గ్రామాల్లో వరద ప్రవాహానికి స్తంభాలు, ట్రాన్స్ఫ్మార్లు నీట మునిగాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రైతుల పంటల సాగుకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పనులు ప్రారంభించాం. నూతన స్తంభాలను ఏర్పాటు చేస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేయిస్తున్నాం. 10వ తేదీలోగాపనులు పూర్తి చేసి, విద్యుత్ సరఫరా అందించేందుకు కృషిచేస్తున్నాం.
– కేషెట్టి శ్రీనివాస్, విద్యుత్ శాఖ, ఏడీఏ/ఏఈ, దస్తురాబాద్