ఎదులాపురం, మే 8 : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఆకాశవాణి కేంద్రం కీలక పాత్ర పోషిస్తున్నదని, ఆదిలాబాద్ రేడియో స్టేషన్ జిల్లాకు వరమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం స్థానిక ఆకాశవాణి కేంద్రంలో 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వాక్ థాన్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ వాక్ థాన్ ర్యాలీ ఆకాశవాణి కేంద్రం నుంచి గాంధీ పార్ వరకు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా చరిత్రలో ఆకాశవాణికి ఒక ప్రత్యేక స్థానం ఉందని, దేశంలో తొలినాళ్లలో ప్రారంభించబడిన మొదటి మూడు ఆకాశవాణి కేంద్రాల్లో ఒకటిగా ఆదిలాబాద్ నిలవడం జిల్లాకు గర్వకారణమని తెలిపారు. అప్పటి నుంచి నేటి వరకు ఈ కేంద్రం ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడారు.
ముఖ్యంగా టీబీ ముక్త భారత్ అభియాన్, ఆరోగ్య పాఠశాల, కేవీకే ద్వారా అందుతున్న వివిధ సంక్షేమ పథకాల సమాచారాన్ని మారుమూల గిరిజన గ్రామాల్లోని ప్రతి ఒకరికీ చేరవేయడంలో ఆకాశవాణి అందిస్తున్న సేవలు అమోఘమని ప్రశంసించారు. టీవీలు, వార్తా పత్రికలు చేరుకోలేని మారుమూల ప్రాంతాల్లో కూడా ఆకాశవాణి సమాచార వారధిగా పని చేసిందని గుర్తు చేశారు. అనంతరం కలెక్టర్కు ఆకాశవాణి అధికారులు మెమొంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారి రమేశ్వర్, సుమన్పతి రెడ్డి, యాంకర్లు లెనిన్, శ్రోతలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.