ఎదులాపురం, డిసెంబర్ 12 ః సెల్ప్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు విలువ ఆధారిత మిల్లెట్స్ స్టార్ట్ అప్‌లో భాగంగా భాగస్వాములను చేయాలని, సభ్యులందరూ జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను సకలంలో చేరుకోవాలని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్‌లో భాగంగా గురువారం జిల్లా ఆహార భద్రత మిషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జాతీయ ఆహార భద్రత మిషన్‌లో జిల్లాకు కేటాయించిన భౌతిక, ఆర్థిక లక్ష్యాలను కమిటీలో చర్చించి ఆమోదించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాకు పప్పు దినుసుల పథకంలో భౌతిక లక్ష్యం 1,29,019, ఆర్థిక లక్ష్యం రూ.1.19 కోట్లు, చిరు ధాన్యాల పథకంలో భౌతిక లక్ష్యం రూ.8,582, ఆర్థిక లక్ష్యం రూ.99.46 లక్షలు, నూనె గింజలు పథకంలో భౌతిక లక్ష్యం రూ.9,388, ఆర్థిక లక్ష్యం రూ.12.53 లక్షలు మండలాలవారీగా కేటాయించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆత్మ జి.రాంకిషన్, లీడ్ బ్యాంకు మేనేజర్ ఉత్పల్ కుమార్, డీడీఎం నాబార్డ్ అబ్దుల్ రౌఫ్, ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం ప్రవీణ్‌రావు, సహాయ సంచాలకులు, కె.శివకుమార్, అష్రఫ్, రవీందర్, ఉద్యాన వన అధికారి కార్తీక్ పాల్గొన్నారు.
సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలలో డైట్, కాస్మొటిక్ చార్జీల పెంపు కార్యక్రమ లాంచింగ్ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి గూగుల్ మీట్ ద్వారా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈనెల 14న రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్, మోడల్ సూల్స్, ఆశ్రమ పాఠశాలలు, కేజీవీబీల్లో డైట్ చార్జీలు పెంపు లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజాలింగు, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ సునీత పాల్గొన్నారు.