నస్పూర్, మార్చి 26 : జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో వ్యవసాయ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నకిలీ పత్తి విత్తనాల వినియోగం వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరించాలన్నారు.
మండలాలు, గ్రామాల్లో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎవరైనా దళారులు విడిగా పత్తి విత్తనాలు అమ్మితే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలతో పంటలు సాగు చేస్తే ప్రభుత్వం నుంచే వచ్చే పథకాలను నిలిపివేస్తామన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు బస్టాండ్, రైల్వేస్టేషన్, సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి కల్పన, అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలలో భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అక్రమ కట్టడాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి రిజిస్టర్లో వివరాలు నమోదు చేసి గ్రీవెన్స్ నంబర్ కేటాయించాలన్నారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి 21 రోజుల్లోగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అనంతరం మండల, సబ్ డివిజన్ కమిటీల వారీగా వచ్చిన దరఖాస్తులపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, ఆర్డీవోలు, తహసీల్దార్, తదితరులు పాల్గొన్నారు.