హాజీపూర్, నవంబర్ 19 : పరిశుభ్రతతోనే వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం హాజీపూర్ తాహసీల్దార్ కార్యాలయంలో మరుగుదొడ్ల జాతీయ దినోత్సవం నిర్వహించగా, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, తహసీల్దార్ శ్రీనివాస్ రావ్ దేశ్ పాండేతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటికీ మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ను అందజేశారు. కర్నమామిడి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్ అందుతుందన్నారు. రైతులు ధాన్యా న్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. కలెక్టర్ వెంట మండల పరిషత్ అధికారి ప్రసాద్ ఉన్నారు.
లక్షెట్టిపేట, నవంబర్ 19 : మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం గుల్లకోట గ్రామంలో ఇందిరా మహిళాశక్తి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన పెరటి కోళ్ల యూనిట్‌ను అధికారులతో కలిసి సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళల కోసం క్యాంటీన్లతో పాటు మీ సేవ కేంద్రాలు, డైరీ, కోళ్ల ఫారంలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం గుల్లకోట, బలరావుపేట, జెండావెంకటాపూర్ గ్రామాల్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా గ్రామీణాబివృద్ధి అధికారి కిషన్, హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ దేశ్‌పాండే తదితరులు ఉన్నారు.
మంచిర్యాలటౌన్, నవంబర్ 19 : బార్లో మద్యం సేవించి విధులకు హాజరైన మంచిర్యాల మున్సిపల్ ఉద్యోగుల వ్యవహారం ఆలస్యంగా బయటకు వచ్చింది. డ్యూటీలో ఉండగా వారు మద్యం సేవిస్తున్నట్లు కనిపించే వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ విషయం కమిషనర్‌కు తెలియగా, ఆయన సదరు ఉద్యోగులను మందలించినట్లు ప్రచారం జరుగుతోంది. మంచిర్యాల మున్సిపాలిటీలో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు దర్జాగా బార్లో మద్యం సేవించడాన్ని గమనించిన పలువురు వారి వీడియోను చిత్రీకరించారు. అనంతరం వారు మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహించడాన్ని గమనించారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి పలువురు తీసుకువెళ్లగా.. కేవలం మందలించి వదిలేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.