నిర్మల్, జూన్ 11(నమస్తే తెలంగాణ) : వెనుకబడిన కులాల్లోని చేతివృత్తుల వారిని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రూ.లక్ష ఆర్థిక సహాయ పథకం ఆశాదీపమవుతున్నది. బీసీ కులాలకు చేయూతనందిస్తూ సీఎం దార్శనికత చాటుకుంటున్నారు. ఈ పథకంతో చేతివృత్తులపై ఆధారపడిన అనేక కులాలకు ప్రయోజనం చేకూరనున్నది. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నాం. ఈ నెల 20వ తేదీలోగా మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నాం. స్వీకరించిన దరఖాస్తులను పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు, గ్రామాల్లో ఎంపీడీవోలు పరిశీలిస్తారు. క్షేత్రస్థాయిలో స్క్రూట్నీ చేసిన తర్వాత జిల్లాస్థాయి అధికారుల పరిశీలనకు కలెక్టర్ లాగిన్లోకి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. అర్హులను పారదర్శకంగా ఎంపిక చేసి జిల్లా మంత్రి ఆమోదంతో లబ్ధిదారులకు రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఈ సందర్భంగా పథకం అమలు తీరు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అంశాలపై నిర్మల్ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి లోకేశ్వర్‌రావు ‘నమస్తే’కు వివరించారు.
నమస్తే : రూ.లక్ష సాయం కోసం అర్హులను ఎలా గుర్తిస్తారు?
అధికారి : బీసీ కులాల్లోని చేతివృత్తుల వారిని ఎంపిక చేసేందుకు వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటాం. ధ్రువీకరణ పత్రాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తాం.
నమస్తే : ఏయే కులాలకు ఈ పథకం వర్తిస్తుంది?
అధికారి : నాయీ బ్రాహ్మణ, రజక, సాగర ఉప్పర, కుమ్మరి, అవుసలి, కంసాలి, కమ్మరి, కంచరి, వడ్ల, కృష్ణ బలిజ, మేదరి, వడ్డెర, ఆరె కటిక, మేర, ఎంబీసీ కులాల వారికి పథకం వర్తిస్తుంది.
నమస్తే : ఎంత మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారు?
అధికారి : ఈ పథకం అమలు ప్రక్రియ నిరంతరంగా సాగుతోంది. దశలవారీగా అందరికీ ఆర్థిక సాయం అందుతుంది. దరఖాస్తుదారుల అర్హతలను బట్టి ఎంపిక ఉంటుంది.
నమస్తే : గతంలో ఏదైనా పథకం పొందిన వారికి వర్తిస్తుందా?
అధికారి : గతంలో రూ.50 వేల వరకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం పొందిన వారికి వర్తించదు. ఇందులో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు మినహాయింపు ఉంటుంది.
నమస్తే : లబ్ధిదారుల ఎంపిక కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు?
అధికారి : మండల స్థాయిలో ఎంపీడీవో, మున్సిపల్ పరిధిలో కమిషనర్లు ఉంటారు. అలాగే జిల్లా స్థాయిలో బీసీ అభివృద్ధి అధికారి, కలెక్టర్‌తో కమిటీ ఏర్పాటు చేశాం. వీరి పర్యవేక్షణలో పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సాగుతది.
నమస్తే : ఆర్థిక సాయం పొందిన వారికి ఉపాధిపై ఎలాంటి అవగాహన కల్పిస్తారు?
అధికారి : ప్రభుత్వ సాయం పొందిన లబ్ధిదారులు తమ కులవృత్తిని నిర్వహిస్తున్నారా? లేదా? అని పరిశీలించడానికి ఒక స్పెషలాఫీసర్ ఉంటారు. వారిపై మండల స్థాయిలో అధికారుల నిరంతర మానిటరింగ్ ఉంటుంది. అలాగే తమ చేతివృత్తికి మెరుగులద్ది, ఆధునికతను జోడించాలనుకునే వారికి ప్రభుత్వం తరఫున అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది.