కోటపల్లి : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా చెన్నూర్ రూరల్ ( Chennur Rural ) సర్కిల్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు (Women Police) అందరికి ఆదర్శమని చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్ (CI Sudhakar) అన్నారు.
కోటపల్లి పోలీస్ స్టేషన్లోని చెన్నూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో శనివారం సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మహిళా కానిస్టేబుల్స్ మౌనిక, మయూరి, దీక్షిత, రాజేశ్వరిని సన్మానించి బహుమతులను అందచేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధి లో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లను ఆదర్శం గా తీసుకోవాలన్నారు.
పోలీస్ వృత్తి అంటేనే భయపడే రోజుల నుంచి పోలీస్ వృత్తి అంటే ఒక సామాజిక బాధ్యతనే స్థాయికి తీసుకురావాలని సీఐ ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యం తో ముందుకు సాగి మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి, నీల్వాయి ఎస్సైలు రాజేందర్, శ్యామ్ పటేల్ పాల్గొన్నారు.