మంచిర్యాల టౌన్, జూలై 20 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో మంగళవారం నిర్వహించే బీఆర్ఎస్ రైతు సదస్సుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. లక్షెట్టిపేట సమీపంలోని అంకతిపల్లిలోగల వాసవీ ఫంక్షన్హాల్లో ఉదయం 11 గంటలకు రైతు సదస్సు ప్రారంభంకానున్నది. లక్షెట్టిపేటలోని కరీంనగర్ చౌరస్తా వద్ద కేటీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఫంక్షన్ హాల్ వరకూ ర్యాలీగా బయలుదేరి వెళ్లనున్నారు.
రైతు సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే పూర్తి చేశారు. రైతు సదస్సుకు దాదాపు మూడు వేల మంది రైతులు హాజరయ్యేలా బీఆర్ఎస్ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, చిన్నయ్యతో పాటు టీబీజీకేఎస్ నాయకులు, ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు పడుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ వైఫల్యాలను వివరించడంతో పాటు బీఆర్ఎస్ హయాంలో రైతు సంక్షేమానికి, అభ్యున్నతికి చేసిన పనులను కేటీఆర్ వివరించనున్నారు.
ఆచరణసాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టిన తీరును ఆయన ఈ సదస్సులో ఎండగట్టనున్నారు. ముఖ్యంగా రైతులకు విత్తనాలు, యూరియా కొరత, సాగునీరు అందించకపోవడం, పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, ధాన్యం కొనుగోళ్లు చేపట్టక పోవడం, రైతు భరోసా ఎగవేత, తదితర అంశాలను ఆయన రైతులకు వివరించనున్నారు. అనంతరం మే 6న లక్షెట్టిపేట మండలంలో పంటలను కాపాడుకునేందుకు వెళ్లి మృత్యువాత పడ్డ నలుగురి రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున.. మొత్తం రూ. 20 లక్షల సాయాన్ని అందించనున్నారు.