భీమారం, ఆగస్టు 4 : వివేక్‌కు అధికారమిస్తే కనీసం రైతుల బాధలు పట్టించుకున్నది లేదని, కనీసం అసెంబ్లీలో ముంపు బాధితుల గురించి మాట్లాడలేక పోయారని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కలగూర రాజ్‌కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూర్ నియోజకవర్గ వ్యాప్తంగా మహిళా భవనాలు, గ్రంథాలయాలకు రూ. 40 కోట్లు తీసుకొస్తే.. ఏమాత్రం అవగహన లేని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆ నిధులను మురుగు కాల్వ పనులకు వాడుతున్నారని ఎద్దేవా చేశారు.
అధికారం లేక ముందు ముంపు గ్రామాల్లో కరకట్టలు నిర్మించాలని, రైతులకు పంట నష్టం పరిహారం ఇవ్వాలంటూ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, గద్దెనెక్కగానే ఆ విషయాన్నే మరచిపోయారని మండిపడ్డారు. కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఊర చెరువు మరమ్మతుల కోసం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రూ. 79 లక్షలు ప్రొసీడింగ్ చేస్తే, అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఆ నిధులు వృథాగా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసరి మధునయ్య, నాయకులు వడ్ల కొండ కిష్టయ్య, ఆకుదారి మధు , తదితరులు పాల్గొన్నారు.