ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు అత్యంత భక్తిప్రపత్తుల మధ్య జరుపుకున్నారు. ప్రధాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే భక్తుల సందడి కనిపించింది. భక్తులు ప్రత్యేక పూజలు, హారతులు, రుద్రాభిషేకాలు, హోమం, యజ్ఞాది కార్యక్రమాలను నిర్వహించారు.
శివపార్వతుల కల్యాణ మహోత్సవం కనుల పండువగా చేపట్టారు. జాగారం, ఉపవాసం ఉండి బోళా శంకరుడిని ఆరాధించారు. నిర్వహకులు ఆలయల్లో బారికేడ్లు, షామియానాలు, తాగునీరు వంటి సౌకర్యాలను కల్పించారు. నీల కంఠుడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తజనం బారులుదీరింది.
ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. శివ లింగానికి భక్తులు పాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ మల్లికార్జున స్వామి ఆలయంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
– నమస్తే నెట్వర్క్