నార్నూర్, సెప్టెంబర్ 23 : ముప్పై పడకల హాస్పిటల్లో సదుపాయలతో పాటు వైద్యులు, సిబ్బందిని నియమించాలని కోరుతూ బిజెపి మండల అధ్యక్షుడు బిక్కు రాథోడ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టామని తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతమైన నార్నూర్, గాదిగూడ మండల మారుమూల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ముప్పై పడకల దవాఖానను ప్రారంభించిందన్నారు.
నేటికీ కనీస సౌకర్యాలు, వైద్య సిబ్బంది కొరత ఉండడంతో అత్యవసర సమయంలో వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్, ఉట్నూర్ ప్రభుత్వ హాస్పిటల్ వెళ్లాల్సి వస్తుందన్నారు. సుమారు 80 కిలోమీటర్ల దూర ప్రయాణంలో సకాలంలో వైద్యం అందక మార్గమధ్యంలో ఎన్నో ప్రణాలు కోల్పోయిర సంఘటనలు ఉన్నాయన్నారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు దీక్ష చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. విషయం తెలిసిన నార్నూర్ సీఐ ప్రభాకర్, ఎస్సై అఖిల్, పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని దీక్ష విరమించుకోవాలని సముదాయించిన.. వినకపోవడంతో వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్యక్రమంలో నాయకులు ప్రకాష్, దేవిదాస్, రాజు, శ్రీకాంత్, శ్రీధర్ తదితరులున్నారు.