నిర్మల్ అర్బన్, ఆగస్టు 8 : మహిళలు, బాలికలు, విద్యార్థినుల భద్రతకు షీటీం భరోసాగా నిలుస్తున్నది. నిర్మల్ జిల్లాలో 9 నవంబర్ 2016లో షీటీం సేవలు ప్రారంభమయ్యాయి. మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన, ఇబ్బందులకు గురిచేసిన, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నది. నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు 30 మంది ఆకతాయిలను పట్టుకొని కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు కఠిన చర్యలకు పాల్పడ్డ కేసులో 3 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిర్మల్ జిల్లాలో హాట్‌స్పాట్ కేంద్రాలను పోలీసులు గుర్తించారు. ఈ కేంద్రాలపై మరింత దృష్టి సారిస్తున్నారు.
120 హాట్స్పాట్లపై నిఘా పటిష్టం
నిర్మల్, భైంసా డివిజన్ల వారీగా షీటీంలను ఏర్పాటు చేశారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణ ప్రాంతాల్లో 120 హాట్స్పాట్లను పోలీసులు గుర్తించారు. షీటీం బృందాలను ఏర్పాటు చేసి నిఘాను పటిష్టం చేశారు. ఈ ప్రదేశాల్లో మహిళలు, యువతులు, విద్యార్థినులపై ఎక్కువగా వేధింపులు జరుగుతున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 628 సార్లు పర్యటించినట్లు ఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నిర్మల్ జిల్లాలో షీటీం బృందాలు, పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్, పబ్లిక్ స్థలాలు, బస్టాండ్లు, దవాఖానలు, జనసమూహం ఉండే ప్రదేశాల్లో మొత్తం 111 అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలకు షీటీం సేవలు, ఫిర్యాదులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాలలో, కళాశాలలో విద్యార్థులకు ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, ఫోక్సో, షీటీం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ క్రైం అంశాలపై అవగాహన కల్పించారు.
క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదులు
జిల్లాలో 24 గంటల పాటు మహిళల భద్రత కోసం పోలీసులు కృషి చేస్తున్నారు. ఒకసారి వేధిస్తూ పట్టుబడితే వ్యక్తితో పాటు కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. తీరు మారకపోతే కేసు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. ఆకతాయిలపై ఫిర్యాదు చేసేందుకు వెనుకాడవద్దని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు సూచిస్తున్నారు. క్యూఆర్ కోడ్ ఆధారంగా ఫిర్యాదులు చేయవచ్చని అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని అత్యంత రద్దీ ప్రదేశాల్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్ పోస్టర్లను అందుబాటులో ఉంచామని, కోడ్‌ను స్కాన్ చేయగానే http qr.tspolice.gov.in లింక్ వస్తుందని పేర్కొన్నారు. దానిపై క్లిక్ చేయగానే ఫిర్యాదు పారం ఓపెన్ అవుతుందని, ఇందులో పేరు లోకేషన్ వివరాలు పూరించి సబ్మిట్ చేయగానే జిల్లా పోలీస్ కార్యాలయంలోని షీటీం సాఫ్ట్వేర్ విభాగానికి తమ ఫిర్యాదు చేరుతుందని వివరించారు. అక్కడ నిరంతరం పర్యవేక్షించే సిబ్బంది ఆన్లైన్ ఫిర్యాదులపై దృష్టి సారించి ఆ లొకేషన్ పరిధిలోని అధికారులకు ఫార్వర్డ్ చేయడంతో సంబంధిత పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని తదుపరి చర్యలు చేపడుతారని వెల్లడించారు. డయల్ 100కు గానీ, షీటీం వాట్సాప్ నంబర్ 8712659550 ఫోన్ చేసినా,sheteamnirmal123@gmail.comకు ఫిర్యాదు చేసిన తక్షణ సేవలు అందించనున్నారు.
వేధిస్తే ఫిర్యాదు చేయండి
మహిళలు, విద్యార్ధినులను ఎవరైనా వేధించిన, అసభ్యకరంగా మాట్లాడినా వెంటనే డయల్ 100కు గానీ, షీటీం నంబర్ 8712659550కు సమాచారం అందించాలి. వివరాలను గోప్యంగా ఉంచుతాం. బాధితులు పోలీస్ స్టేషన్‌కు రాకుండానే ఆకతాయిలకు వారి కుటుంబ సభ్యుల మధ్య కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. పద్ధతి మార్చుకోకపోతే కేసు నమోదు చేసి కఠిన శిక్షలు విధిస్తాం.
– సుమాంజలి, షీటీం ఎస్ఐ, నిర్మల్
హాట్స్పాట్లపై నిఘా
నిర్మల్‌ను ఈవ్‌టీజింగ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు షీటీం బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. జిల్లాలో 120 హాట్ స్పాట్లను గుర్తించాం. ఈ ప్రదేశాల్లో నిఘాను పటిష్టం చేస్తున్నాం. మఫ్టీలో పోలీసులను ఉంచుతూ ఆకతాయిల భరతం పడుతున్నాం. జిల్లాలో 30 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్ ఇవ్వగా 16 పీటీ కేసులు, ముగ్గురిపై ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేశాం.
-ప్రవీణ్ కుమార్, ఎస్పీ, నిర్మల్ జిల్లా