మంచిర్యాల, ఫిబ్రవరి 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నేడు(గురువారం) ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ స్థానంతోపాటు మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కాగా.. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికలకు ముందు రోజు శివరాత్రి రావడం వారికి కలిసొచ్చింది. బుధవారం రాత్రి మొదలుకుని గురువారం ఉదయానికి ఓటర్లందరినీ చేరుకునేలా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఓ ప్రధాన జాతీయ పార్టీకి చెందిన అభ్యర్థి రెండు రోజుల ముందే ఓటర్లకు డబ్బులు వచ్చాయి. ఓటకు రూ.2 వేల నుంచి రూ.3 వేల దాకా ముట్టజెప్పారని ఓటర్లు చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న మరో జాతీయ పార్టీకి చెందిన అభ్యర్థి కూడా భారీగా పైసలు గుప్పిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక టీచర్ ఎమ్మెల్సీ బరిలో ఉన్న ఓ జాతీయ పార్టీ అభ్యర్థి టీచర్లకు ఏకంగా ఓటుకు రూ.5 వేల చొప్పున ముట్టజెప్పినట్లు తెలిసింది. రాష్ట్ర అధికార పార్టీ సపోర్ట్ ఉన్న అభ్యర్థి టీచర్లకు ఓటుకు రూ.2వేల చొప్పున ఇచ్చినట్లు సమాచారం. చదువుకున్న పట్టభద్రులు, టీచర్లు మాత్రం డబ్బులు తీసుకుని ఎవరికి ఓటు వేయాలో వారికి వేసేందుకు సిద్ధం అవుతున్నారు.
మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి టి.జీవన్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రఘోత్తంరెడ్డిల పదవీకాలం మార్చి 29వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ఈ నెల 3వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం 54 మంది, టీచర్ ఎమ్మెల్సీ కోసం 16 మంది బరిలో నిలిచారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయం త్రం 4 గంటల దాకా పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులతో అధికారులకు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 69,134 పట్టభద్రుల ఓటర్లు, 5,693 ఉపాధ్యాయ ఓటర్లు మొత్తం 74,827 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 32,585 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్రుల ఓటర్ల కోసం 40, ఉపాధ్యాయ ఓటర్ల కోసం 18 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ఆఫీసర్లు 60, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు 181, మైక్రో అబ్జర్వర్లు 25, రూట్ ఆఫీసర్లు 12 మంది మొత్తం 229 మంది అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో 6,607 మంది ఓటర్లు ఉండగా 17 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి పట్టభద్రుల కోసం రెండు, టీచర్ల కోసం ఒక పోలింగ్ కేంద్రం కేటాయించారు. మిగిలిన 14 పోలింగ్ స్టేషన్లు కామన్ పోలింగ్ స్టేషన్లుగా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ఆఫీసర్లు 19, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు 87, మైక్రో అబ్జర్వర్లు 17 మందిని నియమించారు.
ఆదిలాబాద్ జిల్లాలో 16,528 మంది ఓటర్లు ఉండగా 39 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ఆఫీసర్లు 46, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు 153, మైక్రో అబ్జర్వర్లు 28, జోనల్ ఆఫీసర్లు 9 మంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు.
నిర్మల్ జిల్లాలో 19,107 ఓటర్లు ఉండగా 46 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ఆఫీసర్లు 37, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు 148, మైక్రో అబ్జర్వర్లు 26 మంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 400 మంది పోలీసు సి బ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. బుధవా రం స్థానిక టీటీడీసీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అవాంఛనీయ ఘటనలు జరగకుం డా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యే విధంగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్ (సెక్షన్ 144) అమలులో ఉంటుందని 100 మీటర్ల 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని తెలిపారు. గుం పులు గుంపులుగా తిరగడం పార్టీ జెండాలను పార్టీ గుర్తులను ధరించి లోపలికి వెళ్లడం ప్రదర్శించడం వంటివి చేయకూడదని తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేదని తెలిపారు. అదనపు ఎస్పీ ఆపరేషన్ బి.సురేందర్రావ్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల సందర్భంగా బుధవారం టీటీడీసీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను, ఎన్నికల బ్యాలెట్ బాక్స్‌ల కోసం క్లోజ్డ్ బాడి వెహికల్స్‌లో అమర్చిన జీపీఎస్ డివైస్‌ను కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో తాగునీరు, భోజన వసతి కల్పించామని తెలిపారు. పోలింగ్ స్టేషన్‌కు వెళ్లేందుకు వాహనాలు సమకూర్చామన్నారు. బ్యాలెట్ బాక్స్‌లు తరలించేందుకు ఆరు క్లోజ్డ్ బాడి వెహికల్స్‌లో జీపీఎస్ డివైస్‌ను అమర్చామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్యామలదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్ పాల్గొన్నారు.