దస్తురాబాద్, డిసెంబర్ 28 : దస్తురాబాద్ మండలం పెర్కపల్లె గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్(హవల్దర్) రామకృష్ణ అంత్యక్రియలు, బుధవారం స్వగ్రామంలో ఆర్మీ అధికార లాంఛనాలతో నిర్వహించారు. రామకృష్ణ పురుగుల మందు తాగగా, 28న పూణేలో మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, ఆయన మృతదేహాన్ని అక్కడి నుంచి హానరీ కెప్టెన్‌తో సహా ఇద్దరు జేసీవోలు, 32 మంది ఆర్మీ జవాన్లు స్వగ్రామానికి బుధవారం ఉదయం తీసుకవచ్చారు. ఆర్మీ అధికారిక లాంఛనాలతో పార్థీవదేహాం వద్ద కన్నీటి వీడ్కోలుతో జాతీయ జెండాను, పుష్పగుచ్ఛాన్ని పెట్టి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియాలు పూర్తిచేశారు. గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు కలిచివేశాయి.
తరలివచ్చిన జనం..
రామకృష్ణకు తుది వీడ్కోలు పలికేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎంపీపీ సింగరి కిషన్, సర్పంచ్ అప్పని ప్రభాకర్, ఉప సర్పంచ్ నరేశ్, ఎస్ఐ జ్యోతిమణి, ఉమ్మడి జిల్లా టీజీవో అధ్యక్షుడు అజ్మీరా శ్యాంనాయక్, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, పోలీసు సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.