మాంగళ్యం తంతునానేన మమజీవన హేతునా..!
కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం..!!
ఈ శ్లోకం భార్యాభర్తల మధ్య గల శాశ్వత బంధం గురించి తెలిపే మంగళసూత్రం విశిష్టతలను తెలుపుతుంది..! రెండు నెలల విరామం తర్వాత శుభ గడియాలు ప్రారంభంకానున్నాయి. నేటి(శుక్రవారం) నుంచి ఈనెల 19వ తేదీ వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెళ్లిభాజాలు మోగనున్నాయి. కల్యాణ మండపాలు, బంగారు, వస్త్ర దుకాణాలు కళకళలాడనున్నాయి. పంతుళ్లు, ఫొటో, వీడియోగ్రాఫర్లు, మేళతాళాలు, ఈవెంట్ ఆర్గనైజర్లు బిజీ కానుండగా, ఈ 17 రోజుల్లోనే వేలాది జంటలు ఏకం కానున్నాయి. మళ్లీ జనవరి 22వ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభమవుతుండగా.. మార్చి 18 వరకూ అన్నీ మంచిరోజులు ఉన్నాయి.
– భైంసా, డిసెంబర్ 1
నేటి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెళ్లి బాజా మోగనున్నది. శుక్రమౌఢ్యమి రావడంతో మంచి ముహూర్తాలు లేక దాదాపు రెండు నెలలు ఖాళీగా ఉన్న కల్యాణ మండపాలు, బంగారు, వస్త్ర దుకాణాలు కళకళలాడనున్నాయి. పంతుళ్లు, ఫొటో, వీడియోగ్రాఫర్లు, మేళతాళాలు, ఈవెంట్ ఆర్గనైజర్లు బిజీ కానున్నారు. ఈ నెల 2 నుంచి 19వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉండడంతో రోజుకు పదుల సంఖ్యలో వివాహాలు, శుభకార్యాలు జరుగనున్నాయి.
అందరూ మెచ్చే విధంగా రుచికరమైన భోజనం, కల్యాణ మండపాలను అత్యంత ఆకర్షణీయంగా అలంకరించడం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్లేట్లనిండా తీపి పదార్థాలతోపాటు అనేక రుచులతో వంటకాలను కేటరింగ్‌కు ఇచ్చి తయారు చేయిస్తున్నారు. కల్యాణ మండపాలను వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పలురకాల పూలతో అత్యంత శోభాయమానంగా అలంకరిస్తున్నారు. ఈ పని కూడా కల్యాణమండపాల వారికే అప్పగిస్తున్నారు.
పెళ్లిళ్లు, పండుగల సందర్భాల్లో సంప్రదాయ వస్త్రరీతులపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. మగవారైతే రాజస్థానీ, షేర్వాణీ, లాల్చీ పైజామాతోపాటు ఆధునిక ఫ్యాషన్లను అనుసరిస్తున్నారు. యువతులైతే చీర, ఎంబ్రాయిడరీ చేసిన వస్ర్తాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే కల్యాణ మండపాలకు గిరాకీ ఏర్పడుతోంది. పెళ్లిళ్ల సీజన్లో కల్యాణ మండపాలు దొరకడం కష్టంగా మారుతోంది. దీన్ని అవకాశంగా తీసుకుని నిర్వాహకులు ఖర్చులు, అద్దెలు పెంచేస్తున్నారు. దీంతో చేసేదేమిలేక కొందరు ఖాళీ స్థలాల్లోనే భారీ సెట్టింగులతో పెళ్లి మండపాలను తయారు చేసుకుంటున్నారు.
మళ్లీ జనవరి చివరి వారం వరకు ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేవని పండితులు చెప్పడంతో రోజుకు పదుల సంఖ్యలో పెళ్లిళ్లు జరిపించేందుకు కల్యాణ మండపాలు బుక్ అయిపోయాయి. హోటల్ రూమ్స్ ఫుల్ అయ్యాయి. కల్యాణ మండపాల డెకరేటివ్స్, ఎలక్ట్రీషియన్స్, వంటలు చేసేవారు ఇలా ఎవర్ని కదిపినా డిసెంబర్ నెలాఖరువరకు మమ్మల్ని మాట్లాడీయవద్దని కరాఖండిగా చెబుతున్నారు. పెళ్లికి సంబంధించిన వివిధ వస్తువుల విక్రయాలు జోరందుకున్నాయి. మళ్లీ దగ్గర్లో ముహూర్తాలు లేకపోవడంతో ఈ నెలలోనే వందలాది జంటలు ఏకం కానున్నాయి. జిల్లా కేంద్రాలతోపాటు పలు పట్టణాల శివార్లలో ఉన్న కల్యాణమండపాలు రోజుకు రెండు, మూడు పెళ్లిళ్లు అన్నట్లు తయారయ్యాయి. బంగారం వ్యాపారం కూడా ఊపందుకుంది.
ఈ సీజన్లో గిఫ్ట్ ఆర్టికల్స్‌కు డిమాండ్ ఉంది. పెళ్లికి వచ్చే ప్రతి ఒక్కరూ బహుమతులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. ఇంటిని అందంగా ఉంచే బొమ్మలతోపాటు గృహోపకరణాలు అందంగా గిఫ్ట్ ప్యాక్ చేయించి అందజేస్తున్నారు.
పెళ్లిళ్ల సమయంలో వినియోగించిన సంప్రదాయ పూజా సామాగ్రికి ప్రస్తుతం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. తాళిబొట్టు నుంచి కాలిమట్టెల వరకు ప్రతి అంశంలోనూ నాటి సంప్రదాయాలనే అనుసరిస్తున్నారు. మేనమామలు పెళ్లికూతుర్ని తీసుకొచ్చే బుట్టను కూడా పలురకాల పేపర్లతో అందంగా తయారు చేస్తున్నారు. అనంతరం పెళ్లి పీటల మీద కూర్చునే పెళ్లి కూతురు చేతుల్లో ఉంచే కొబ్బరి బొండాంను కూడా అందంగా అలంకరిస్తున్నారు.
అధునాతన అలంకరణకు లక్షలు ఖర్చుపెట్టి కల్యాణ వేదికలు తయారు చేస్తున్నారు. వివాహ వేడుకల్లో ఖరీదైన బెంజ్ కార్లతోపాటు పురాతన ఎద్దుల బండి, గుర్రపుబండిపై వధూవరులను ఊరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పాటల కచేరీ, భరతనాట్యం, సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారు. మధ్య తరగతి వారు వేలల్లో అయితే ఉన్నత వర్గాలవారు రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి పెళ్లిళ్లతో జిల్లా సందడి వాతావరణం సంతరించుకోనున్నది.
రెండు నెలల నుంచి శుక్రమౌఢ్యమి కొనసాగుతుండగా, డిసెంబర్ 2వ తేదీ నుంచి 15 రోజులు మంచి రోజులు వచ్చాయి. ఈ 15 రోజుల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కలిపి వేలాది సంఖ్యలో వివాహాది శుభకార్యాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా డిసెంబర్లో 2,3,4, 8, 9, 11,14, 16,18, 19 మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 23వ తేదీ అమావాస్య, 24వ తేదీ నుంచి పుష్యమాసం (శూన్యమాసం) ఆరంభమవుతుంది. ఈ క్రమంలో శుభకార్యాలు పనికిరావు. తిరిగి మళ్లీ జనవరి 22వ తేదీ నుంచి మాఘమాసం మంచిరోజులు ప్రారంభమవుతాయి. ఇందులో మార్చి 18వ తేదీ వరకూ అన్నీ మంచిరోజులు ఉన్నాయి. ఆ సమయంలో అత్యధికంగా వివాహాది శుభకార్యాలు జరుపుకోవచ్చు. జనవరి 26వ తేదీ వసంతపంచమి వస్తుంది. ఇందులో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో శుభకార్యాలు ఉన్నాయి.
– శిరిన్ బెలే, పురోహితుడు, భైంసా.