ఆసిఫాబాద్ టౌన్,మే 12 : జిల్లాలో సీఎం కప్ క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ బోర్కడే హేమంత్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్‌పాయ్‌లతో కలిసి సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 22 నుంచి 24 వరకు నిర్వహించనున్న సీఎం కప్ క్రీడా పోటీలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
16 నుంచి 36 ఏళ్లలోపు క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని చెప్పారు. బాక్సింగ్ పోటీలు కాగజ్‌నగర్‌లో, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ పోటీలు గోలేటిలో, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, హ్యాండ్ బాల్, అథ్లెటిక్స్ పోటీలు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకులాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోటీలకు అవసరమైన క్రీడా మైదానాలను,సామగ్రి సిద్ధం చేయాలని సూచించారు. ఈ నెల 15 నుంచి 17 వరకు నిర్వహించనున్న మండలస్థాయి సీఎం కప్ క్రీడా పోటీల పూర్తి వివరాలతో 18న నిర్వహించనున్న తదుపరి సమీక్షా సమావేశానికి హాజరు కావాలని పేర్కొన్నారు.
ఈ పోటీలకు కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్పీ వైస్ చైర్మన్‌గా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కో వైస్ చైర్మన్‌గా, జిల్లా క్రీడలు,యువజన అధికారి కన్వీనర్‌గా, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, డీఈవో, ఇండస్ట్రీస్ జీఎం, మున్సిపల్ కమిషనర్లు సభ్యులుగా వ్యవహరిస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో డీవైఎస్వో మణెమ్మ, పరిశ్రమల శాఖ అధికారి రఘు, సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.