కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): వెదురు కళలపై ఆధారపడే వారికి చేయూతనిచ్చి.. వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో సర్కారు ముందుకెళ్తున్నది. ఈ మేరకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని సాలెగూడ వద్ద రూ. 20 లక్షలతో అర ఎకరంలో ప్రత్యేక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి, ప్రతిభ గల కళాకారుల ద్వారా తర్ఫీదు ఇప్పించేందుకు సన్నద్ధమవుతున్నది. అద్భుతంగా రూపొందిం చిన అలంకరణ..ఆట వస్తువులను అమ్ముకునేలా చర్యలు చేపడుతున్నది.
ఉమ్మడి జిల్లాలో 4 వేల కుటుంబాలు
వెదురు బొంగులతో తడకలు, బుట్టలు, చాటలువంటి ఉత్పత్తులను తయారు చేస్తూ ఉపాధి పొందే మేదరుల కుటుంబాలు ఉమ్మడి జిల్లాలో 4 వేలకు వరకు ఉంటాయి. మన అడవుల్లో టేకుతో పాటు వెదురు వనాలు వందల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లో దొరికే వెదురుతోనే ఈ కళాకృతులను తయారు చేస్తుంటారు. ఒక్కో కళాకారుడుకి 20 నుంచి 30 వెదురు బొంగులు ఉంటే చాలు దాదాపు ఏడాది వరకు సరిపోతాయి. వీటితో అలంకరణ వస్తువులతో పాటు ఇంట్లో ఉపయోగించే వాటిని కూడా తయారుచేసి విక్రయిస్తుంటారు. భార్యాభర్తలు కలిసి దినమంతా కష్టపడితే రూ. 400 నుంచి రూ.500 వరకు సంపాదిస్తారు. అయితే కాలక్రమేనా ప్లాస్టిక్ వస్తువుల వాడకం పెరగడంతో వీరికి ఉపాధి కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో మారుతున్న కాలానికనుగుణంగా ఆకట్టుకునేలా వెదురు కళాఖండాలు తయారు చేసేలా ప్రభుత్వం వీరికి శిక్షణ ఇప్పించేందుకు సన్నద్ధమవుతున్నది.
ఇప్పటికే హైదరాబాద్లో 15 మందికి శిక్షణ
మారుతున్న కాలానికనుగుణంగా సరికొత్త కళాఖండాలను తయారు చేసేలా మేదరులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని అధికారులు భావించారు.ఈ మేరకు రెండేళ్ల క్రితం హైదరాబాద్లోని పోచంపల్లిలోని శిక్షణ కేంద్రానికి ఉమ్మడి ఆదిలాబాబాద్ జిల్లా నుంచి 15 మందిని ఎంపిక చేసి పంపించారు. వీరు శిక్షణ పూర్తి చేసుకొని వచ్చారు. వీరి ద్వారా సాలెగూడలో శిక్షణ ఇప్పించనున్నారు.
అబ్బురపరిచే ఆకృతులు..
హైదరాబాద్లో శిక్షణ పొందిన 15 మంది కళాకారుల్లో.. ప్రస్తుతం ఆరుగురు అద్భుతమైన కళాఖండాలు సృష్టిస్తున్నారు. ఇంట్లో అలంకరణ కోసం వినియోగించే వస్తువులతో పాటు నిత్యజీవితంలో వాడుకునే వాటిని సైతం రూపొందిస్తున్నారు. ఇంట్లో వినియోగించే కూరగాయల బుట్టలు, నెమళ్లు, ఎడ్ల బండ్లు, బెడ్లైట్స్, రక రకాల బొమ్మలు ఇలా అనేక వస్తువులు తయారు చేస్తూ ప్రదర్శనల్లో పెడుతున్నారు. ఒక్కో వస్తువుకి రూ. 1000 నుంచి రూ. 12000 వరకు ధర పలుకుతుందని వారు చెబుతున్నారు. గత నెల 18న ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ రాహుల్రాజ్ సందర్శించారు. వెదురు కళాఖండాలను చూసి అద్భుతమని కొనియాడారు. మేదరులకు శిక్షణ ఇప్పించడంతో పాటు.. వస్తువులను అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
ఆర్డర్లు వస్తున్నాయి…
వెదురు కళాకృతులకు మంచి స్పందన వస్తుంది. కొందరు బొమ్మలను చూసి ఆర్డర్ ఇస్తున్నారు. మరికొంత మంది వారికి నచ్చిన విధంగా చెప్పి మరీ తయారు చేయించుకుంటున్నారు. ఆదిలాబాద్ కలెక్టర్ నాకు 30 వస్తువులు కావాలని అడిగారు. ఆసిఫాబాద్ జేసీ కూడా ఆరు బొమ్మలకు ఆర్డర్ ఇచ్చారు. ఒక్కో దానికి రూ. 1000 నుంచి రూ. 1200 వరకు అమ్ముతున్నం. మంచి నైపుణ్యంతో తయారు చేసేవాటికి మంచి డిమాండ్ ఉంటుంది.
– సంద గోపాల్,వెదురు కళాకారుడు
21 రోజుల పాటు శిక్షణ
ప్రభుత్వం మాకు హైదరాబాద్లో 21 రోజుల పాటు ప్రత్యేకంగా వెదురు కళాకృతుల తయారీపై శిక్షణ ఇచ్చింది. అప్పటి నుంచి నేను వెదురుతో అనేక కళాకృతులను తయారు చేస్తున్నా. వెదురుతో ఇలాంటి రూపాలు తయారు చేయటమే వృత్తిగా చేసుకున్నా. చేతి వృత్తుల వారికి సర్కారు ప్రోత్సాహం ఇవ్వడం బాగుంది.
– నీలం శంకర్, వెదురు కళాకారుడు, చింతగూడ, కాగజ్నగర్
సంతోషంగా ఉంది
ప్రభుత్వం వెదురుకళాకారులను ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇంతకాలం వెదురుతో చాటలు, గంపలువంటివి తయారు చేస్తుండేవాళ్లం. మారుతున్న కాలాన్ని బట్టి ఆ వస్తువులకు ఆదరణ తగ్గింది. ప్రభుత్వం మాకు వెదురు అలంకరణ వస్తువులు తయారు చేయడంపై శిక్షణ ఇవ్వడంతో మాకు ఉపాధి దొరికినైట్లెంది. ఆసిఫాబాద్లో శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం బాగుంది. – ములంగిరి రాజేశ్, రెబ్బెన