నిర్మల్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : తమ అస్థిత్వాన్ని పటిష్టం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆర్టీసీ చేస్తున్న ప్రయత్నాలకు క్రమంగా స్పందన లభిస్తున్నది. ప్రైవేట్ వాహనాల ధాటికి ఆర్థికంగా దెబ్బతిన్న ఆ సంస్థ తిరిగి కోలుకునే దిశగా చేపడుతున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. సీఎం కేసీఆర్… ఆర్టీసీ సంస్థ మనుగడ కాపాడేందుకు చేయూతనిస్తుండడమే కాకుండా, సంస్థను ఆర్థికంగా ఆదుకునేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆర్టీసీలో నెలకొన్న నిర్వహణ లోపం కూడా కొంత మేరకు ప్రభావం చూపిందంటున్నారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోని రెండు ఆర్టీసీ డిపోల్లో కొద్ది రోజుల నుంచి అమలు చేస్తున్న సంస్కరణలు ఫలితాలనిస్తున్నాయి. ‘ప్రజల వద్దకు ఆర్టీసీ’ నినాదంతో నెల రోజుల నుంచి నిర్మల్ ఆర్టీసీ డిపో అధికారులు అమలు చేస్తున్న కార్యాచరణతో సంస్థ ఆదాయంలో మార్పు కనిపిస్తున్నది. ఇందులో భాగంగా ఆర్టీసీ డిపో అధికారులు కొద్ది రోజుల నుంచి పలు గ్రామాలను సందర్శిస్తూ అక్కడి ప్రజలకు ఆర్టీసీ అందిస్తున్న సేవలను వివరిస్తున్నారు. గ్రామ సర్పంచ్‌తో పాటు అక్కడి ప్రజాప్రతినిధులు, వీడీసీ సభ్యులను సమావేశ పరిచి ప్రైవేట్ వాహనాలతో జరుగుతున్న ప్రమాదాలు, తదితర వివరాలను తెలియజేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఎంతో సురక్షితమైనదని, సుఖవంతమైనదని చెబుతూ ప్రజలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా చూడాలని కోరుతున్నారు. అలాగే గ్రామాల్లోని ప్రజల కోరిక మేరకు అవసరమైతే అదనపు ట్రిప్పులను సైతం నడుపుతామని హామీ ఇస్తున్నారు.
దీంతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. భైంసా డిపో పరిధిలోని ముథోల్ మండలం అష్టా గ్రామంలో అక్కడి ప్రజల సహకారంతో ఆటోలను పూర్తిగా నిషేధించ గలిగారు. గతంలో ఈ రూట్లో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల కోసం రెండు ట్రిప్పులు మాత్రమే నడిపేవారు. ప్రస్తుతం గ్రామస్తుల కోరిక మేరకు ప్రతి రోజూ ఐదున్నర ట్రిప్పులను నడుపుతున్నారు. అలాగే ఆర్టీసీ సంస్థ విద్యార్థులకు అందిస్తున్న రాయితీలు, ఇతర ప్రయోజనాలను కూడా గ్రామీణులకు వివరిస్తున్నారు. పెళ్లిళ్లు.. ఇతర శుభకార్యాలకు వెళ్లే వారు ఆర్టీసీ బస్సులను ముందస్తుగా బుక్ చేసుకుంటే రాయితీలను కల్పిస్తామంటున్నారు. ముఖ్యంగా ప్రైవేటు వాహనాలు ఎక్కువగా తిరిగే గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ఆర్టీసీ అధికారులు చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమం అందరి మన్ననలను అందుకుంటున్నది. డిపో మేనేజర్ స్థాయి అధికారితో పాటు సంస్థలో పనిచేసే సీనియర్ అధికారులు గ్రామాల్లోని కొందరు ముఖ్యుల ఇండ్లకు సైతం వెళ్లి ఆర్టీసీ బస్సు ప్రయాణాలకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేగాకుండా గ్రామాల్లోని పాఠశాలల్లో విద్యార్థులకు ‘ప్రయాణంలో ఆర్టీసీ పాత్ర’ అనే అంశంపై వ్యాస రచన పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేస్తున్నారు. అధికారుల ఈ సరికొత్త ప్రయోగం క్రమంగా సత్ఫలితాలిస్తోందంటున్నారు. దీంతో నెల రోజుల నుంచి జిల్లాలోని నిర్మల్, భైంసా డిపోల్లో ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుండడం గమనార్హం. నెల రోజుల క్రితం వరకు నిర్మల్ డిపో ఆదాయం రోజుకు 22 లక్షల వరకు ఉండగా, ప్రస్తుతం ప్రతిరోజూ రూ.24 నుంచి రూ.25 లక్షల వరకు ఆదాయం వస్తున్నదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అలాగే భైంసా డిపో పరిధిలో గతంలో రోజుకు రూ. 7 నుంచి రూ. 8 లక్షల వరకు ఆదాయం ఉండగా, ప్రస్తుతం రూ. 11 నుంచి రూ. 12 లక్షల వరకు ఆదాయం వస్తున్నది.
ప్రత్యేక ప్యాకేజీలు..
ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు గతానికి భిన్నంగా అధికారులు కృషి చేస్తున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో ప్రయాణికులను ఆకర్షించేందుకు చర్యలు చేపడుతున్నారు. అతి తక్కువ టికెట్ ధరకే టూరిజం ప్యాకేజీని అమలు చేస్తుండడంతో మంచి స్పందన వస్తున్నది. శని, ఆదివారం హైదరాబాద్ నుంచి నిర్మల్ చుట్టు పక్కల గల పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా నిర్మల్ డిపో నుంచి బస్సులను నడుపుతున్నారు. ఈ బస్సులు హైదరాబాద్ నుంచి ఉదయం 5 గంటలకు బయలు దేరి నిర్మల్ సమీపంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నిర్మల్‌లోని కొయ్యబొమ్మల తయారీ కేంద్రం, పొచ్చెర, కుంటాల జలపాతాలను సందర్శించి తిరిగి రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటాయి. ఈ పర్యటన కోసం పెద్దల నుంచి ఒక్కొరికీ రూ.1099, పిల్లలకు రూ.599 చార్జి వసూలు చేస్తున్నారు. ఒక రోజు కుటుంబ సభ్యులతో విహార యాత్రకు వెళ్లే వారికి ఇది ఎంతో అనుకూలంగా ఉండడంతో పట్టణ వాసుల నుంచి మంచి స్పందన వస్తున్నదని అధికారులు చెబుతున్నారు.
రూట్ల వారీగా బృందాల ఏర్పాటు
నిర్మల్ డిపో పరిధిలో 64 రూట్లలో, భైంసా డిపో పరిధిలో 26 రూట్లలో ఆర్టీసీ ప్రతి రోజూ మొత్తం 222 బస్సులను తిప్పుతున్నది. అయితే ప్రైవేట్ వాహనాలను కట్టడి చేసేందుకు ఈ 90 రూట్లలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఈ టీంలలో ఓ సీనియర్ అధికారితో పాటు ఇతర సిబ్బందిని నియమించారు. ఈ రూట్ టీంలు… ప్రధాన కూడళ్లలో, బస్సులు, ప్రైవేట్ వాహనాలను నిలిపే చోటుకు వెళ్లి ప్రయాణికులను కలుస్తున్నారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం సురక్షితం కాదని, ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలంటూ బహిరంగంగా కోరుతున్నారు. ఉదయం నుంచి సా యంత్రం వరకు ఈ టీంలు ప్రతీ ప్రైవేట్ వాహనాన్ని ఆపి అందులోని ప్రయాణికులకు ఆర్టీసీ బస్సు ప్రయాణంతో జరిగే మేలును వివరిస్తున్నారు. అంతే కాకుండా ప్రతీ నెలా మూడో మంగళవారం ప్రయాణికులకు బస్సు ఎక్కేటప్పుడు ఆర్టీసీ సిబ్బంది గులాబీ పువ్వును అందజేసి సాధరంగా ఆహ్వానిస్తున్నారు. దీంతో ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించడం వల్ల తమకు లభిస్తున్న గౌరవాన్ని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అనేక రకాలుగా ప్రయాణికులను ఆర్టీసీ వైపు చూసేలా అధికారులు చేపడుతున్న చర్యలు సంస్థ మనుగడకు తోడ్పాటునందిస్తున్నాయంటున్నారు.
ఆర్టీసీ సిబ్బంది చాలాబాగా చూసుకున్నారు…
నేను గత నెల 11న నలుగురు మిత్రులతో కలిసి ఆర్టీసీ టూరిజం ప్యాకేజీ బుక్ చేసుకున్నా. కుంటాల జలపాతం గురించి టీవీలు, పేపర్లలో చూశాను. ఎలాగైనా వెళ్లాలని ఈ టూర్ ప్యాకేజీ ద్వారా ప్లాన్ చేసుకున్నాం. కుంటాలతో పాటు పొచ్చెర జలపాతాన్ని చూశాం. ఆర్టీసీ సిబ్బంది మమ్మల్ని చాలాబాగా చూసుకున్నారు. ఒక గైడ్ మాదిరిగా దగ్గరుండి అన్ని ప్రదేశాలను చూపించారు. వర్షం పడితే గొడుగులను కూడా ఇచ్చారు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందాన్ని పొందాము. కేవలం రూ. 1100తో నిర్మల్ ప్రాంతంలోని రెండు జలపాతాలు, ఎస్సారెస్పీ ప్రాజెక్టు, నిర్మల్ కొయ్యబొమ్మల తయారీ కేంద్రాన్ని సందర్శించాం. హైదరాబాద్ నుంచి కారులో వస్తే ఖర్చులు తడిసిమోపెడయ్యేవి. ఇంత మంచి టూర్ ప్యాకేజీ అందించిన ఆర్టీసీకి అభినందనలు. ఇలాంటి వాటిని పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలి.
– ఎస్.జగన్మోహన్రావు, రిటైర్డ్ తహసీల్దార్, దిల్సుఖ్నగర్, హైదరాబాద్
ఆర్టీసీ ప్రజల రవాణా సంస్థ..
ఆర్టీసీ ప్రజల రవాణా సంస్థ. దీనిని ఎంత ఆదరిస్తే అదే స్థాయిలో సేవలను మరింత విస్తృతం చేస్తాం. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలి. ఆర్టీసీ కార్గో సేవలను అందిస్తున్నది. అలాగే టూరిజం ప్యాకేజీలు ఉన్నాయి. అన్ని వర్గాలకు ఉపయోగ పడే సేవలను ఆర్టీసీ అందిస్తున్నది. ఈ సేవలను వినియోగించుకొని ఆర్టీసీని ఆదరించండి.
– సుధాపరిమళ, రీజినల్ మేనేజర్, ఆదిలాబాద్
ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తాం..
ఇది వరకు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేవాళ్లం. రాను రానూ ఆటోరిక్షాలు పెరగడంతో ఆర్టీసీ బస్సులు బంద్ చేశారు. ఇటీవల ఆర్టీసీ ఆఫీసర్లు మా ఊరికి వచ్చి సర్పంచ్, వీడీసీ సభ్యులను కలిసి ప్రైవేట్ వాహనాల్లో వెళ్లవద్దని, ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు. అంతేగాకుండా మీ గ్రామానికి ఎన్ని ట్రిప్పులైనా పంపుతామని హామీ ఇచ్చారు. దీంతో మా గ్రామంలో ఆటోలు, ఇతర ప్రైవేట్‌వాహనాలను నిషేధించారు. బస్సులో కాకుండా ఆటోల్లో వెళ్లే వారికి రూ.500 జరిమానా వేస్తారు. ప్రతిఒక్కరూ బస్సులో వెళ్లాల్సిందే.
– సాయిలు, ప్రయాణికుడు, అష్ట