లక్ష్మణచాంద, అక్టోబర్ 9 : మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన బట్టు సాయన్నపై మంత్రాల నెపంతో గతనెల 3వ తేదీన హత్యాయత్నం చేసిన నలుగురు నిందితులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు డీఎస్పీ జీవన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ధర్మారం గ్రామానికి చెందిన మేకల ముత్యం-రాధ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందుకు అదే గ్రామానికి చెందిన బట్టు సాయన్న మంత్రాలు చేయడమే కారణమని భావించారు. ఈ విషయాన్ని ముత్యం.. తన బావమరిది, మామడ మండలం కమల్‌కోట్ గ్రామానికి చెందిన పల్లికొండ రాజుకు విషయం తెలిపారు. ఇతను తన బంధువు నాగరాజు, అలాగే ముత్యం బంధువైన మైనర్ బాలుడితో కలిసి సాయన్నను చంపేందుకు పథకం రచించారు. సెప్టెంబర్ 3వ తేదీ రాత్రి పల్లికొండ రాజు బైక్‌పై వచ్చి, వెనుక నుంచి సాయన్న మెడపై కత్తితో బలంగా నరికారు. అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు గమనించి వెంటనే దవాఖానకు తరలించారు. అప్పటి నుంచి నిందితుల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. కాగా, ఆదివారం నలుగురిని రిమాండ్ చేశారు. హత్యాయత్నానికి ఉపయోగించిన బైక్‌తో పాటు, కత్తి, నాలుగు మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
మంత్రతంత్రాలు అనేవి కేవలం మూఢనమ్మకాలేనని డీఎస్పీ జీవన్‌రెడ్డి అన్నారు. అనారోగ్యానికి గురైనప్పుడు చికిత్సకోసం దవాఖానకు వెళ్లాలని సూచించారు. మం త్రాలు చేశారని, మంత్రగాళ్లు ఉన్నారని అమాయక ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. నిందితులను పట్టుకున్న సీఐ రాం నర్సింహారెడ్డి, స్థానిక ఎస్ఐ రాహుల్, పోలీసు సిబ్బంది గంగాధర్, అశోక్, సునీల్, కిరణ్‌ను అభినందించారు.