నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 9 : జాతీయ స్థాయిలో గ్రామాలకు అవార్డులు ప్రకటించనున్న నేపథ్యంలో గ్రామంలో చేసిన అభివృద్ధి పనుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని డీఆర్డీవో విజయలక్ష్మి పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. నిర్మల్ జడ్పీ కార్యాలయంలో శుక్రవారం జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేషనల్ పంచాయతీ అవార్డు పోటీల్లో పాల్గొనేందుకు గ్రామ పంచాయతీలు పోటీ పడాలని సూచించారు.
జిల్లాలో 396 గ్రామ పంచాయతీలు, 18 మండలాలను 9 కేటగిరీల్లో అవార్డుల కింద ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఇందులో జీవనోపాధి, ప్రజల ఆరోగ్యం, నీటి సమృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత, స్వయం సమృద్ధి, మంచి పరిపాలన, వివిధ సంక్షేమ పథకాల కింద గ్రామీణ నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎంపిక చేస్తారని తెలిపారు. ఈ నెల 10 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మోహన్, శ్రీనివాస్‌రావు, సాయిరాం, సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.
ఖానాపూర్ టౌన్, సెప్టెంబర్ 9 : జాతీయ పంచాయతీ అవార్డు 2023కు ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజల సమన్వయంతో పనులు చేపట్టాలని నిర్మల్ డీపీవో శ్రీలత అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల పంచాయితీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2022-23 సంవత్సరానికి 9 కేటగిరీల్లో జాతీయ స్థాయి అవార్డులకు ఈ నెల 10వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో సర్పంచ్‌లకు అవగాహన కలిగి ఉండేలా చూడాలని కార్యదర్శులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు అల్లాడి వనజ, లింబాద్రి, వెంకటేశ్వర్లు, ఎంపీవోలు చంద్రశేఖర్, రత్నాకర్, అనిల్, సిబ్బంది పాల్గొన్నారు.
భైంసాటౌన్, సెప్టెంబర్ 9 : వానల్పాడ్ గ్రామంలో జడ్పీ సీఈవో సుధీర్ బాబు కుంటాల, భైంసా మండలాల పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని మౌలిక వసతులు, నిర్వహణ, విధులపై అవగాహన కల్పించారు. ఉత్తమ పంచాయతీల అవార్డుల కోసం ప్రతి అంశాన్ని ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు గంగాధర్, మోహన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.