పల్లె ప్రజల వలసలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకంపై కేంద్రం కుట్ర చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు సంకేతాలు పంపేందుకు రంగంలోకి దిగిన బృందాలు వాస్తవాలను చూసి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలాగైలా టీఆర్ఎస్ సర్కారును బద్నాం చేయాలనే ఉద్దేశంతో అభివృద్ధి పనులు, రికార్డులు, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించగా, ఎక్కడా ఎలాంటి లోపాలు కనపడకపోవడం నివ్వెరపరిచింది. పనుల్లో సాధించిన ప్రగతిని చూసి ఆశ్చర్యపోవడం వారి వంతైంది. ఇక వారి వ్యవహారశైలితో ఆందోళనకు గురైన కూలీలు, తమ పొట్టగొట్టాలని చూస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.
ఆదిలాబాద్ ప్రతినిధి/నిర్మల్, జూలై 27(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామాల్లోని పేదలకు ప్రయోజనకరంగా ఉంది. రైతులు, వ్యవసాయ కూలీలు ఎండాకాలంలో ఈ పథకం ద్వారా ఉపాధి పొందుతారు. జిల్లాలో 468 గ్రామ పంచాయతీలుండగా, 1.75 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. 3.69 లక్షల మంది కూలీలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఉపాధి పథకంలో భాగంగా గ్రామాల్లో వివిధ రకాల పనులను చేపడుతారు. ఈ పనులతో రైతులు, స్థానికులకు ప్రయోజనం చేకూరుతుంది.
యేటా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అవసరమైన పనులు, అందుకు అయ్యే ఖర్చులను ముందుగానే గుర్తిస్తారు. వాటి ఆమోదం తర్వాత పనులు చేపడుతారు. ఈ ఏడాది జిల్లాలో రూ.38.44 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.13.33 కోట్లు వెచ్చించింది. పనులు చేయడం ద్వారా గ్రామాల్లో కూలీలకు రోజూ రూ. 183 కనీస వేతనం లభించింది. జిల్లా వ్యాప్తంగా యేటా ఎండాకాలంలో రోజూ 50 వేల నుంచి 60 వేల మంది ఉపాధి హామీ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతారు. పల్లెల్లో ఎక్కడా చూసిన గుంపులు, గుంపులుగా కూలీలు పనులు చేస్తూ కనిపిస్తారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వీరికి పనులు కల్పించేలా చూడడంతోపాటు వేతనాలు కూడా పంపిణీ జరిగేలా చూస్తారు.
నిర్మల్ జిల్లాలో..
జిల్లాలో ఈ నెల 15, 16, 17, 18 తేదీల్లో నాలుగు రోజులపాటు అధికారుల బృందం పర్యటించింది. నిర్మల్ మండలం భాగ్యనగర్, కొత్త పోచంపాడ్, మేడిపెల్లి, వెంగ్వాపేట్ గ్రామల్లో చేపట్టిన ఉపాధి పనులను పరిశీలించారు. మామడ మండలంలోని మామడ, కొరిటికల్, అనంతపేట్ గ్రామాల్లో పర్యటించారు. ఉపాధి అధికారులు రూపొందించిన ఎంబీల ఆధారంగా రికార్డయిన లెక్కలను పరిగణలోకి తీసుకొని, పూర్తయిన పనుల కొలతలను తనిఖీ చేసింది. అలాగే పనుల నాణ్యత, కూలీలకు వేతనాల చెల్లింపులు లాంటి అంశాలను పరిశీలించింది.
ఉపాధి పనుల నిర్వహణలో ఉపయోగించే 7 రకాల రికార్డులను పరిశీలించారు. అంతేకాకుండా చేపట్టిన పనులకు గ్రామసభ ఆమోదం ఉన్నదా… తదితర అంశాలను లోతుగా పరిశీలించారు. అయితే ఈ అధికారుల బృందం పూర్తయిన పనులను చూసి నివ్వెర పోయింది. రికార్డులలో చూపిన దానికన్నా ఎక్కువ నాణ్యతతో పనులు పూర్తయిన విషయాన్ని ఈ కేంద్ర బృందం గమనించింది. ఎలాగైనా తప్పులు, పొరపాట్లను వెలికి తీయాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
ఈ అధికారుల బృందం పనులకు సంబంధించి నెగెటివ్ రూపంలో అడిగిన ప్రశ్నలకు ఇక్కడి జిల్లా ఉపాధిహామీ అధికారులు ఇచ్చిన సమాధానాలు వారిని ఆశ్చర్యపరిచాయి. సోన్ మండలంలోని పాక్పట్లలో 15 ఎకరాల్లో రూ. 30 లక్షలతో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనం, ఇతర పనులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వివిధ రకాల పండ్లు, పూలు, ఔషధ గుణాలు కలిగిన సుమారు 45 వేల మొక్కలు ఇక్కడ నాటడంతో నందన వనంగా మారింది. ప్రైవేట్ టూరిస్టు స్పాట్‌గా, రిసార్టులను తలపించే రీతిలో ఏర్పాటు చేసిన ఈ బృహత్ పల్లె ప్రకృతి వనం కేంద్ర బృందాన్ని విశేషంగా ఆకట్టుకుంది.
కూలీలపై కేంద్ర కుట్ర
గ్రామీణ పేదలకు కష్టకాలంలో ఉపాధి కల్పిస్తున్న ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఉపాధి హామీ పనుల ప్రగతిని అభాసుపాలు చేసి, రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు సంకేతాలు పంపేందుకోసం రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వ బృందాలు వాస్తవాలను చూసి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉపాధి హామీ పనుల్లో రాష్ట్రం ముందు వరుసలో నిలుస్తుండడాన్ని జీర్ణించుకోలేని కేంద్ర ప్రభుత్వం, ఎలాగైనా సరే తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నది. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. గ్రామపంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఉపాధి కూలీల వివరాలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పనుల్లో ఎలాంటి లోపాలు కనపడకపోయినా ఏదో జరిగినట్లు హడావుడి చేశారు. సహజంగా ఉండే చిన్న లోపాలను గుర్తించి వాటిని రికార్డు చేసుకున్నారు. రైతు వేదికలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. జిల్లాలో నాలుగు రోజులపాటు జరిగిన కేంద్ర బృందం సభ్యుల పర్యటన గ్రామాల్లో కూలీలను ఆందోళనకు గురిచేస్తున్నది. తనిఖీల పేరిట మోదీ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని ఎత్తివేసే ప్రయత్నాలు చేస్తున్నదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఉపాధి కల్పిస్తున్న ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగినా తగినబుద్ధి చెబుతామని కూలీలు అంటున్నారు.
v పనుల్లో పారదర్శకతను చూసి ఆశ్చర్యపోయారు..
జిల్లాలో ఉపాధి హామీ కింద చేపట్టిన పనులను పరిశీలించిన కేంద్ర బృందం ఆశ్చర్యపోయింది. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, రైతుల కోసం ఏర్పాటు చేసిన క్యాటిల్ షెడ్లు, సెగ్రిగేషన్ షెడ్లు, ప్రధాన రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఎవెన్యూ ప్లాంటేషన్ మొదలగు పనులను పరిశీలించారు. సెగ్రిగేషన్ షెడ్లో ఎరువుల ఉత్పత్తిని చూసి ఆశ్చర్యపోయారు. అలాగే చేపట్టిన పనుల కొలతలను తీసుకొని, కూలీలకు చెల్లించిన మొత్తాన్ని పరిశీలించారు. అన్నీ సక్రమంగా ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు.
– విజయలక్ష్మి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి, నిర్మల్