బేల, జూలై 22 : వర్షాకాలం సీజన్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఎంపీవో సమీర్ హైమద్ సూచించారు. మండలంలోని గూడ, చప్రాల, సాంగిడి గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కుండీలు, డ్రమ్ములు, టైర్లలో నిల్వ ఉన్న నీటిని పారబోశారు. ఈ సందర్భంగా ఎంపీవో మాట్లాడుతూ వారంలో ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటిస్తూ నిల్వ ఉన్న నీటిని పారబోసి నూతన నీటిని పట్టుకోవాలని సూచించారు. గ్రామంలో పారిశుధ్య పనులు, క్లోరినేషన్, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట సర్పంచ్‌లు ఠాక్రే బేబి తాయి, కన్నల సుమన్‌బాయి, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
తాంసి మండలంలో..
తాంసి, జూలై 22 : మండల కేంద్రంతో పాటు కప్పర్ల, బండలనాగాపూర్, పొన్నారి, వడ్డాడి, సవర్గాం, హస్నాపూర్ గ్రామాల్లో డ్రైడే నిర్వహించారు. సర్పంచ్‌లు, వైద్యసిబ్బంది, ఆశకార్యర్తలు గ్రామాల్లో ఇళ్లను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పాత కుండీలు, టైర్లు, గుంతల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పలుచోట్ల నిల్వ ఉన్న నీటిని పారబోశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కృష్ణ, సదానందం, కేశవ్‌రెడ్డి, వెంకన్న, భరత్, అశోక్, నర్సింగ్, ఎంపీటీసీలు అశోక్, సంతోష్, పంచాయతీ కార్యదర్శులు విజయ్‌కుమార్, గంగన్న, అమిద్, అనిత, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
క్లోరినేషన్ పనులు..
బోథ్, జూలై 22: మండంలోని సాకెర, కౌఠ(బీ), ధన్నూర్(బీ), అందూర్ గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టారు. నీటి వనరులను క్లోరినేషన్ చేశారు. బావుల్లో బ్లీచింగ్ పౌడర్ కలిపారు. మురుగు కాలువలు శుభ్రం చేయడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లారు. పరిసరాల శుభ్రత గురించి అవగాహన కల్పించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు మీరాబాయి, రాధిక, గంగాధర్, అంగూరిబాయి, రాజేశ్వర్, రమేశ్, గంగాధర్, గులాబ్‌సింగ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.