ఆదిలాబాద్ ప్రతినిధి/నిర్మల్(నమస్తే తెలంగాణ), జూలై 12 : నిర్మల్ జిల్లావ్యాప్తంగా ఐదో రోజూ వాన జోరుగా కురుస్తున్నది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల వల్ల కడెం, గడ్డెన్న, స్వర్ణ ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతున్నది. వరద ఉధృతిని అంచనా వేస్తూ అధికారులు దిగువనకు నీటిని వదులుతున్నారు. మంగళవారం కురిసిన వర్షంతో నిర్మల్-ఖానాపూ ర్ హైవేపై దిమ్మదుర్తి వద్ద అప్రోచ్ రోడ్డు తెగిపోవడంతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. రాకపోకలకు అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు జరుగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సారంగాపూర్ మండలంలోని స్వర్ణకు వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో మంత్రి ప్రాజెక్టును సందర్శించి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద దిగువనకు ప్రవహిస్తున్నది. దీంతో నిర్మ ల్ పట్టణ శివారుల్లోని వాగు ఒడ్డు న గల జీఎన్ఆర్ కాలనీ వాసు లు ఆందోళన చెందుతున్నారు. సిద్ధాపూర్ వద్ద రోడ్డుపై నుంచి స్వర్ణ నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్ వరద ప్రాంతాలను సందర్శించా రు. బాసర మండలంలోని ర వీంద్రపూర్, శారదానగర్ ఇండ్లలోకి నీరు చేరగా.. ఎమ్మె ల్యే విఠల్‌రెడ్డి సందర్శించి బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కలెక్టరేట్లో మంత్రి అల్లోల వరదల పరిస్థితిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తక్కువ సమయం లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో భారీగా నష్టం వాటిల్లిందన్నారు. శాఖలవారీగా నష్టం అంచనాను రూ పొందించాలని నీటి పారుదల, విద్యుత్తు, ఆర్అండ్బీ, పం చాయతీరాజ్ శాఖల అధికారులను ఆదేశించారు.
కడెం, స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్టుల్లోకి ప్రమాదకర స్థాయిలో వరద నీరు చేరుతోంది. ఆయా ప్రాజెక్టులకు భారీగా ఇన్‌ఫ్లో రావడంతో వచ్చిన నీటిని క్రస్ట్‌గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. 694 అడుగుల వద్ద నీటిని స్థిరం గా ఉంచుతూ 16 గేట్ల ద్వారా రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 2,09,000 క్యూసెక్కులు ఉం ది. స్వర్ణ ప్రాజెక్టుకు 23,473 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ప్రాజెక్టునాలు గు గేట్లను ఎత్తి 28,027 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు 32 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండడంతో మూడు గేట్లను ఎత్తి 20,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.నది పరీవాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.
మంగళవారం నిర్మల్ జిల్లా సగటు వర్షపాతం 61.6 మిల్లీ మీటర్లుగా నమోదైంది. మామడ మండలంలో అత్యధికంగా 162.4 మిల్లీమీటర్లు, కుభీర్‌లో 48, తానూర్‌లో 26.8, బాసరలో 25.8, ముథోల్‌లో 22.8, భైంసాలో 28.2, కుంటాలలో 44.2, నర్సాపూర్(జి)లో 16.8, లోకేశ్వరంలో 10, దిలావర్పూర్లో 55.8, సారంగాపూర్‌లో 68.6, నిర్మల్‌లో 93.4, నిర్మల్ రూరల్‌లో 60.5, సోన్‌లో 53.5, లక్ష్మణచాందలో 84.6, పెంబిలో 121.8, ఖానాపూర్‌లో 69.2, కడెంలో 110.6, దస్తురాబాద్ మండలంలో 67.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాగా.. ఈ సీజన్లో ఇప్పటివరకు 303.3 మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 626.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కురవాల్సిన వర్షపాతం కంటే 107 శాతం అధికంగా పడింది.