ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వాన వరదలా ముంచెత్తుతోంది. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కుంటాల, పొచ్చెర, కొరిటికల్, చింతలమాధర జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. గేట్లు ఎత్తి దిగువనకు నీటిని వదలడంతో పరవళ్లు తొక్కుతున్నాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలయమం కాగా.. కొన్ని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రహదారులపై వరద ఉధృతంగా పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటలు నీట మునుగగా.. వృక్షాలు నేలకొరిగాయి. గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తుండగా.. ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచింది.. నిర్మల్ పట్టణంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సందర్శించి.. అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆదిలాబాద్ ప్రతినిధి/నిర్మల్(నమస్తే తెలంగాణ), జూలై 9 : ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇంద్రవెల్లి మండలంలోని పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. నేరడిగొండ నుంచి కుంటాల జలపాతానికి వెళ్లే రోడ్డుపై వాగు ప్రవహించడం, గాదిగూడ మండలం కున్నకాస వాగు ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇచ్చోడ మండల ముక్రా(కే) గ్రామంలో చెక్‌డ్యాం పొంగి ప్రవహిస్తుండడంతో స్థానికులు చేపలు పట్టుకున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద కారణంగా నేరడిగొండ మండలం కుంటాల, కొరిటికల్.. బోథ్ మండలం పొచ్చెర జలపాతాలు జళకలను సంతరించున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో సగటు 16.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం నంబర్ 18004251939 ఏర్పాటు చేశారు. అధికారులు, సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వాగులు, వంతెనల వద్ద ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా పోలీసులు ప్రజలకు సహాయ, సహకారాలు అందిస్తున్నారు. పోలీసు సిబ్బంది సహాయ చర్యల్లో భాగంగా తాడు, గజ ఈతగాళ్లు, గొడుగులు, టార్చ్లైట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. సాయం కోసం కంట్రోల్ రూం నంబర్లు 08732226246, 9490619045 నంబర్లకు ఫోన్ చేయాలని ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు.

నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లాలో మూడు రోజులుగా విస్తారంగా వర్షం కురుస్తున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వరద రావడంతో సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. గడ్డెన్న వాగు ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో అధిక వర్షపాతం నమోదు కావడంతో ఒక్కసారిగా ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌కు సమీపంలో ఉన్న నిగ్వ, మోలా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358 అడుగులు కాగా ప్రస్తుతం 357 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 50 వేల క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 50 వేల క్యూసెక్కులుగా ఉంది. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ప్రాజెక్టు నీటిమట్టం 700 అడుగులు కాగా 698 అడుగులకు చేరుకోగా.. తొమ్మిది వరద గేట్ల ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 51 వేల క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 64 వేల క్యూసెక్కులుగా ఉంది. కాగా.. వానకాలం పంటల కోసం శనివారం లెఫ్ట్ కెనాల్ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అలాగే స్వర్ణ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,183 అడుగులు కాగా ప్రస్తుతం 1,178.5 అడుగులకు నీరు చేరుకుంది. మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువనకు వదులుతున్నారు. ఖానాపూర్లోని సదర్మాట్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండదంతో పురాతన అడ్డుకట్ట అయిన రాతి గోడపై నుంచి దిగువకు ప్రవహిస్తున్నది.

నిలిచిన రాకపోకలు
లోకేశ్వరం మండలంలోని కిష్టాపూర్ వద్ద వాగు ఉప్పొంగడంతో ప్రధాన రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్నది. ముందు జాగ్రత్తగా పోలీసులు రాకపోకలు నిలిపి వేశారు. ముథోల్ మండల కేంద్రం నుంచి అబ్దుల్లాపూర్ వెళ్లే రోడ్డులో వడ్తాల్ గ్రామం వద్ద వాగు, పెంబి గ్రామ శివారులోని కడెం వాగు, ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ వాగు, కుంటాల మండలంలోని వెంకూర్ వాగు, భైంసా నుంచి నిజామాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై బిద్రెల్లి వద్ద వాగులు ఉప్పొంగడంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే రాకపోకలను నిలిపివేశారు. కాగా.. బాసర మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ ప్రాంతంలో గల రవీంద్రపూర్, శారదానగర్ కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దాదాపు నాలుగు అడుగుల మేర నీరు చేరడంతో నీట మునిగిన పది ఇండ్లకు చెందిన కుటుంబాల వారిని నాటు పడవల ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఆయా మున్సిపాలిటీల అధికారులు, సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. జిల్లా ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 1800-425-5566 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని తక్షణ సహాయ చర్యలు అందించేందుకు రెవెన్యూ, విద్యుత్, పోలీసు యంత్రాంగం అందుబాటులో ఉండాలని సూచించారు.నిర్మల్ పట్టణంలోని శాంతినగర్, శాస్త్రినగర్, మంచిర్యాల చౌరస్తా, నటరాజ్ నగర్, బుధవార్‌పేట్ హరిజన వార్డు, డాక్టర్స్ లేన్‌లో అటవీ, పర్యారణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సందర్శించారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను, నాలాలను పరిశీలించి, ప్రస్తుత వర్ష పరిస్థితులపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భైంసా పట్టణంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ వరద ప్రాంతాలను సందర్శించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు.

లోకేశ్వరంలో అత్యధిక వర్షపాతం
గత 24 గంటల వ్యవధిలో నిర్మల్ జిల్లా సగటు వర్షపాతం 57.7 మిల్లీ మీటర్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా లోకేశ్వరం మండలంలో 172.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే కుభీర్‌లో 121.4, తానూర్‌లో 78.6, బాసరలో 99.8, ముథోల్‌లో 70.2, భైంసాలో 103.2, కుంటాలలో 62.2, నర్సాపూర్(జి)లో 50.8, దిలావర్పూర్లో 32.4, సారంగాపూర్‌లో 19.2, నిర్మల్‌లో 28.4, నిర్మల్ రూరల్ మండలంలో 27.2, సోన్‌లో 42, లక్ష్మణచాందలో 32.8, మామడలో 18.4, పెంబిలో 18, ఖానాపూర్‌లో 59, కడెంలో 39, దస్తురాబాద్ మండలంలో 21 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
