ఆదిలాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలను వాన వదలట్లేదు. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, అంతటా జలకళ సంతరించుకుంది. జలపాతాల్లో నీటి ప్రవాహం పెరుగగా, ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతున్నది. దీంతో ఆయా చోట్ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం పారుపల్లి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కాగా, ఆదిలాబాద్లో 20. 8, మంచిర్యాల జిల్లాలో 15.9, నిర్మల్లో 6.6, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 20.4 మి.మీ సగటు వర్షపాతం శుక్రవారం నమోదైంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను శుక్రవారం ముసురు కమ్ముకుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండగా, చెరువుల్లోకి నీరు చేరుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా కుంటాల, పొచ్చెర జలపాతాల్లో నీటి ప్రవాహం పెరిగింది. జైనథ్ మండలం సాత్నాల, తాంసి మండల మత్తడి వాగు ప్రాజెక్టుల్లోకి కూడా నీరు చేరుతున్నది. ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని బోథ్, ఇంద్రవెల్లి, నార్నూర్, నిర్మల్ జిల్లాలోని భైంసా, సోన్, ఖానాపూర్ మండలంలో మోస్తరు వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలంలో తుంతుంగ వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. అన్నారం బ్యారేజీ గేట్లు ఎత్తడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. నెన్నెల మండలంలోని కోణంపేట గ్రామంలో రెండు ఇండ్లు కూలిపోయాయి.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాను మూడు రోజులుగా ముసురు వదలట్లేదు. జిల్లాలో కుమ్రం భీం ప్రాజెక్టు సామర్థ్యం 10.393 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.799 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టులోకి 1092 క్యూసెక్యుల ఇన్ఫ్లో వస్తున్నది. అధికారులు రెండు గేట్లను 0.2 మీటర్లు ఎత్తి 1092 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎడమ కాలువ ద్వారా మరో 12 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వట్టి వాగు ప్రాజెక్టు సామర్థ్యం 2.890 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.310 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టు ఎగువ భాగం నుంచి 903 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. అధికారులు కుడికాలువ ద్వారా 5 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఒక గేటుని 1.20 మీటర్లు ఎత్తి 366 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి పెరిగితే రాత్రి వరకు మరో రెండు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.