నిర్మల్, జూలై 4(నమస్తే తెలంగాణ) : బోనం అంటే భోజనం. గ్రామ దేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం. కొత్త కుండలో వండిన బోనం సమర్పించడం ఆనవాయితీ. చిన్న ముంతలో తయారు చేసిన పానకం సాకగా పోస్తారు. ముంతపై దివ్వె పెట్టి బోనం జ్యోతిని వెలిగిస్తారు. ఆ బోనాలను మహిళలు నెత్తిపై పెట్టుకొని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. బోనాలన్నీ వరుసగా వెళ్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. చీకటి పడే సమయంలో జ్యోతులు వెలుగుతూ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. పండుగ రోజున మహిళలు తలస్నానం ఆచరించి, మడితో బోనం తయారు చేస్తారు. ఒక పాత్రలో అన్నం వండి, ఇతర వంటకాలు, ప్రసాదాలు తయారు చేస్తారు.
బోనం తయారు చేసి ఊరేగింపుగా తీసుకువెళ్లే ముందు మూడు అంతస్తులుగా నెత్తిపై ముంతలను పేరుస్తారు. కింద పెద్ద పాత్రలో అన్నం, పెరుగు, బెల్లం.. దానిపైన రెండో పాత్రలో పులుసు, దానిపై పత్తితో తయారు చేసిన ఒత్తి వేసి మంచి నూనెతో వెలిగిస్తారు. ఆలయానికి తీసుకెళ్లేంత వరకు దీపం వెలుగుతూ ఉండేలా శ్రద్ధ తీసుకుంటారు. ఈ బోనాలను వేప ఆకులు, పసుపు, కుంకుమతో అందంగా అలంకరిస్తారు. వివాహం కాని యువతులు బోనం ఎత్తుకుంటే వివాహం అవుతుందనే నమ్మకం ఉంది. బోనాల ఊరేగింపులో శివసత్తులు ముఖానికి పసుపు రాసుకొని అమ్మవారిని స్తుతిస్తూ పూనకంతో ఊగిపోతారు. ఇలా భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు.
తొట్టెల ఊరేగింపు
బోనాల పండుగ ఊరేగింపులో మరో ఆకర్షణీయమైన ఘట్టం తొట్టెల ఊరేగింపు. రంగుల కాగితాలతో ఐదు అంతస్తుల భవనంలా తయారు చేసి అమ్మవారికి సమర్పించడమే తొట్టెల అని పిలుస్తారు. తొట్టెల సమర్పించుకోవడంతో ఇల్లు నిర్మించుకునేలా చూడు తల్లీ అని వేడుకోవడం, ఇల్లు ఉన్న వారు ఈ తొట్టెలను సమర్పించి తమ ఇల్లు సుభిక్షంగా ఉండేలా ఆశీర్వదించమని కోరుకుంటారు. తొట్టెలను తయారు చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం అమ్మవారికి ఆలయ పరిసరాల్లోనే ఉంచుతారు.
పోతరాజుల విన్యాసాలు అదరహో..
బోనాల జాతరలో పోతరాజుల విన్యాసాలు కనువిందు చేస్తాయి. అమ్మవారి సోదరుడే పోతరాజు అని చెప్పుకుంటారు. ఒంటినిండా పసుపు రాసుకొని, నుదిటిపై పెద్ద సైజులో కుంకుమ బొట్టు పెట్టుకొని, నడుముకు వేపాకులు, మువ్వలు చుట్టుకుని.. కాలికి గజ్జెలు కట్టుకుని, ఎరుపు రంగు దోతి ని ధరించి పెద్ద పెద్ద మీసాలతో, చేతిలో చెర్నకోల పట్టుకొని ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉత్సవ మూర్తిలా కనిపిస్తుంటారు. బోనాల ఉత్సవాల ప్రారంభ సమయంలో నిమ్మకాయలు కోసి నాలు గు వైపులా చల్లుతూ అమ్మవారి ఊరేగింపులో సందడి చేస్తుంటారు.
బోనా లు, అమ్మవారి ఊరేగింపు ఆరంభకుడిగా పోతరాజును చెప్పుకోవచ్చు. ఈ వేషం ధరించే వ్యక్తి చక్కటి శరీర సౌష్టవం, మంచి బలశాలిగా ఉంటారు. బోనాల పండుగలో పోతరాజులు డప్పుచప్పుళ్లకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ, చేతిలోని చెర్నకోలను తిప్పుతూ ముందుండి ఉత్సవాలను కొనసాగిస్తారు. లయబద్ధంగా నృత్యం చేస్తూ.. బోనాల ఊరేగింపులో పోతరాజులు ప్రత్యేకతను సంతరించుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో గొర్రె పొట్టేళ్లను అలంకరించి వాటికి చిన్నపాటి బండ్లు కట్టి ఫలహారం బండిగా ఊరేగింపు చేపడుతారు.