ఇచ్చోడ, ఏప్రిల్ 12 : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇచ్చోడ మండలం గుండాల జం ట హత్యల కేసు ఆదిలాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు చేరింది. ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, నేటి నుంచి విచారణ జరగనున్నది. మండలంలో చర్చనీయాంశంగా మారింది.
గుండాల గ్రామంలో గతేడాది అక్టోబర్ 27న ఉర్సూ ఉత్సవాల సందర్భంగా ఒకే సామాజిక వర్గం మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఇందులో మాజీ సర్పంచ్ అబ్దుల్ రషీద్ వర్గం.. ఎంపీటీసీ వర్గానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు షేక్ జైరొద్దీన్, షేక్ ఝూహాను దారుణంగా హత్యచేసింది. అప్పటి జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర, ప్రస్తుత ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. దాడులకు పాల్పడిన 12 మంది(అబ్దుల్ రషీద్, షేక్ అస్లాం, షేక్ అస్గర్, షేక్ షఫత్, షేక్ సద్దాం, షేక్ రబ్బన్, షేక్ జుమ్మా, షేక్ మూస, షేక్ హషమ్, షేక్ హమీద్, షేక్ అల్లాఉద్దీన్, షేక్ జలీల్)ని అక్టోబర్ 29న అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. మిగతా వారిని రెండు వారాల్లో అరెస్ట్ చేసి, బోథ్ సివిల్ కోర్టుకు తరలించారు. ఈ దాడిలో మరో ప్రధాన నిందితుడు అచ్చు, పోలీసులకు దొరకకుండా నేటికీ పరారీలోనే ఉన్నాడు. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం ద్వారా మహారాష్ట్రలోని చికిలి, నాగ్‌పూర్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. తప్పించుకుంటూ తలదాచుకుంటున్నాడని ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపారు. ఈ దాడుల్లో ప్రధాన సూత్రదారి, నిందితుడిగా మాజీ సర్పంచ్ అబ్దుల్ రషీద్‌ను ఏ-1గా గుర్తించారు. ఈ సంఘటనపై పోలీస్ యంత్రాంగం తొమ్మిది వేర్వేరు కేసులను నమోదు చేసింది.
బెయిల్ నిరాకరణ..
ప్రధాన నిందితుడు అబ్దుల్ రషీద్‌తో పాటు మరో పది మందికి బెయిల్ దొరకలేదు. ఆరు నెలలుగా బెయిల్ కోసం ఫిటిషన్ వేస్తున్నా పోలీసులు బెయిల్ రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సంఘటనను ఎస్పీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బెయిల్ కోసం నిందితులు పదిసార్లు వేసిన ఫిటిషన్లను జిల్లా సెషన్ కోర్టు, హైకోర్టు తిరస్కరించింది.