ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
ఆదిలాబాద్ రూరల్, మార్చి 22 : రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో రాణించి, జిల్లాకు పేరు తీసుకురావాలని క్రీడాకారులకు ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి పోటీలను మంగళవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అథ్లెటిక్స్ పోటీల్లో రాణించిన క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నా రు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నదని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల చిన్నారుల్లో నూతనోత్తేజం వచ్చి, చదువులో కూడా రాణిస్తారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న సహకారం తో వచ్చే నెలలో 9 నుంచి 11వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ గ్రౌండ్లో రాష్ట్రస్థాయి ఓపెన్ కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారు రూ.1.10 లక్షల ప్రైజ్‌మనీతో పోటీలను రాత్రి వేళలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ స్కూల్‌ను డిగ్రీ వరకు అప్‌గ్రేడ్ చేసేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారన్నారు. జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు వచ్చే నెల 3 నుంచి 5వ తేదీ వరకు ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి రాయేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు రంగినేని శ్రీనివాస్, జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, వ్యాయామ ఉపాధ్యాయులు స్వామి, కోచ్ రవీందర్, రాజు, సందీప్, నాందేవ్, గోపాల్, సుజాత పాల్గొన్నారు.
విజేతలకు బహుమతులు..
ఆదిలాబాద్ టౌన్, మార్చి 22 : మండలంలో ని యాపల్‌గూడలో నితిన్ స్మారకార్థం జోగు ఫౌం డేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజేతలకు మున్సిపల్ చైర్మన్ బహుమతులు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు అవసరమైన పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైస్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రహ్లాద్, సర్పంచ్ గంగారాం, నాయకులు ఆరె నరేశ్, మధు, గ్రామస్తులు ఉన్నారు.