ఎదులాపురం, మార్చి 13 : పేదలకు నాణ్య మైన వైద్యం అందించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. ఆదిలాబాద్ పట్టణంలో ద్వారకానగర్‌లో డాక్టర్ రవి కిరణ్ యాదవ్ ఏర్పాటు చేసిన 12వ బ్రాంచ్ మాస్ట ర్స్ హోమియోపతి దవాఖానను ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇచ్చే ఉచిత కుట్టు, అల్లికల కోచింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా ప్రజలకు నాణ్యమైన హోమియోపతి వైద్య సేవలను అందించేందుకు ఈ వైద్యశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మహిళలు స్వయం ఉపాధిలో రాణించేందుకు సాయివైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు, అల్లికల్లో శిక్షణలిస్తూ సామాజిక సేవలో రాణిస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, తాంసి జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏ నాగేశ్వర్రావు, ట్రస్ట్ ప్రతినిధులు రఘువీర్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగినేని మనీషా పవన్‌రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ చిట్కాల సుహసిని రెడ్డి, యాదవ సంఘం నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.