ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 17: విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు పెంచాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి అన్నారు. మండలంలోని నర్సాపూర్(జే) బాలికలు,. లక్షెట్టిపేట్ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను శనివారం అకస్మిక తనిఖీ చేశారు. అక్షర జ్యోతి కార్యక్రమం నిర్వహణను పరిశీలించారు. ముందుగా స్టోర్ రూంలోని రికార్డులు పరిశీలించారు. ప్రతిరోజు రిజిస్టరలో వివరాలు నమోదు చేయాలని సూచించారు. వంటగదిలో శుభ్రత, ఆహారపదార్థాలు, కూరగాయలు, భోజనం నాణ్యతను పరిశీలించారు. మోనూ ప్రకారం భోజనం అందించాలని వార్టెన్, సిబ్బందికి సూచించారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడారు. ప్రతీ విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలవాలన్నారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నాణ్యనమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న శిక్షణ, సబ్జెక్టుల వారీగా బోధన తీరును ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. చదువులో వెనుకడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు అక్షర జ్యోతి కార్యక్రమాన్ని ప్రెవేశపెట్టినట్లు వివరించారు. విధుల్లో నిర్లక్ష్యం చూపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాల ఆవరణలో శుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
శ్యాంపూర్ పీహెచ్సీ పరిశీలన….
శ్యాంపూర్ పీహెచ్సీని పీవో పరిశీలించారు. ఓపి నమోదు రికార్డులు, మందుల స్టోర్ రూంను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు, సిబ్బందికి సూచించారు. దవాఖానకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వసతులు కల్పించాలని తెలిపారు. ప్రతీ ఉద్యోగి సమయ పాలన పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది ఉన్నారు.