బోథ్, జూలై 12: మండలంలో మంగళవారం 110.06 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ధన్నూర్ (బీ), అందూర్, దన్నూర్ (కే), రఘునాథ్‌పూర్, అందూర్, సొనాల, చింతల్బోరి, మర్లపెల్లి, నక్కలవాడ, పట్నాపూర్, కోటా (కే), పెద్దగూడ వాగులు పొంగి పొర్లడంతో ఆయా వాగు పరిసర ప్రాంతాల్లోని గ్రామాలకు బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి. ఎదిగే దశలో ఉన్న పత్తి, సోయా, కంది మొలకలు నీరుపట్టి ఎర్రబారి పోతుండడంతో పాటు గడ్డి పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. బోథ్ సీఐ ముదావత్ నైలు, ఎస్ఐ కే రవీందర్, సిబ్బంది వంతెనల వద్ద కాపలాగా ఉన్నారు. పొచ్చెరలో ఓ ఇల్లు కూలింది. బోథ్ వార సంత కొనుగోలు దారులు లేక వెలవెలబోయింది.
పెన్‌గంగ ఉధృతి
భీంపూర్,జూలై12 : ఎడతెరిపి లేని వర్షాలతో మండలంలో వాగులు, పెన్‌గంగకు వరద ప్రవా హం పెరిగింది. సరిహద్దు గుబ్డికి, ఎగువన ఉన్న మహారాష్ట్ర సాయిఫలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద చేరుతుండడంతో గుబ్‌డి, గోముత్రి, వడూ ర్, గొల్లగఢ్ రేవుల వద్ద ప్రవాహం ఉధృతంగా ఉన్నది. ఆదిలాబాద్- కరంజి(టీ) రూట్లో లో లెవన్ వంతెనల మీదుగా వరద ప్రవహిస్తుండడం తో రాకపోకలకు అంతరాయం ఏర్పడంది. ఎస్ఐ రాధిక అంతర్గాం వాగు, పెన్‌గంగ ప్రవాహాన్ని పరిశీలించి అవగాహన కల్పించారు. 26 పంచాయతీల్లో సర్పంచ్‌లు దండోరా వేయిస్తున్నారు.
నేరడిగొండ, జూలై 12 : మండలంలోని వాంకిడి, కడెం, లఖంపూర్, సావర్గాం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సావర్గాం వాగు ఉధృతికి అటువైపుగా ఉన్న 14 గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు. వరదతో పంటలు దెబ్బతిన్నాయి.
ఇచ్చోడ, జూలై 12 : మండలంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇచ్చోడలోని సుభాష్ నగర్, ఇస్లాంపుర, రంజాన్‌పుర, భాగ్యనగర్‌లోని ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. సిరిచెల్మ వెళ్లే రోడ్డు మార్గంలోని ప్రభుత్వ దవాఖాన సమీపంలోని కల్వర్టు పూర్తిగా వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో ఇచ్చోడ-సిరిచెల్మ రాకపోకలు నిలిచాయి. ముక్రా (కే) వాగు ఉధృతంగా ప్రవహించింది.కడెం వాగు ఉధృతికి బాబ్జీపేట్లోని పొలా లు నీట మునిగాయి.అడెగామ(బీ),కోకస్ మ న్నూర్, జోగిపేట్, అడెగామ (కే) గ్రామాలకు వెళ్లే మార్గంలోని ఒర్రెలు ఉప్పొంగి ప్రవహించాయి.
నిలిచిన రాకపోకలు
సిరికొండ,జూన్11: కొండాపూర్, రాంపూర్, ధర్మసాగర్, తుమ్మలపాడు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. చేన్లలోకి వరద చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సుంకిడి,రాంపూర్ (బీ), లక్కాపూర్, కొండాపూర్ లోని పంటలను ఏఈవో ప్రవీణ్ పరిశీలించారు. కొండాపూర్ చిక్మాన్ ప్రాజెక్ట్ పరీవాహక ప్రాంతాల్లో వరద ప్రభావంతో దెబ్బతిన్న పంటలను చూశారు. వర్షాలు తగ్గిన వెంటనే పొలాల్లని నీటిని కాలువల ద్వారా తొలగించాలని సూచించారు.
తాంసి, జూలై 12 : భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో పంటచేలల్లో నీరు నిలిచింది. పత్తి, సోయాబీన్ పంటలకు నష్టం వాటిల్లింది. మండల కేంద్రానికి సమీపంలో ఉన్న వాగును తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో ఆకుల భూమయ్య, ఎస్ఐ కే ధనశ్రీ, జడ్పీటీసీ రాజు, నాయకులు పరిశీలించారు. రెవె న్యూ, పోలీసు, పంచాయతీ అధికారులు అందుబాటులోఉండాలని అన్నారు. వారి వెంట సర్పం చ్ కృష్ణ, ఎంపీటీసీ వన్నెల నరేశ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి ఉన్నారు.
తలమడుగు, జూలై 12 : మండల కేంద్రానికి వచ్చే వంతెనపై నుంచి వరద పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచాయి. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు కార్యాలయాల్లోనే బస చేశారు. ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని తహసీల్ధార్ ఇమ్రాన్‌ఖాన్ సూచించారు. ఎంపీడీవో రమాకాంత్‌తో కలిసి పలు గ్రామాలను సందర్శించారు.
నీట మునిగిన ఉట్నూర్
ఉట్నూర్, జూలై 12 : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉట్నూర్ డివిజన్ కేంద్రాన్ని వరద ముంచెత్తింది. మండల కేంద్రంలోని అంబేద్కర్ ప్రధాన రహదారి, షాపింగ్ కాంప్లెక్స్‌లు నీట మునిగాయి. వరద ఏకంగా ఇండ్లు, దుకాణాల్లోకి చేరడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. నీటిని తరలించేందుకు జీపీ ప్రత్యేక అధికారులు జేసీబీతో పనులు చేపట్టారు. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యే రేఖానాయక్, ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు సంఘటన స్థలాలను పరిశీలించారు. నీటికి అడ్డుతగులుతున్న వాటిని తొలగించి నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉట్నూర్‌లోని ఐబీ వంతెన, నాగాపూర్ వంతెనపై నుంచి భారీగా వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచాయి.
ఉట్నూర్ రూరల్, జూలై 12: మండలంలోని చెరువులు, కుంటల్లోకి భారీ గా వరద చేరుతున్నది.చెరువులు మత్తళ్లు దూకుతున్నాయి. మండలంలోని మారుమూల గ్రామాలైన నర్సాపూర్(జే), కన్నాపూర్, వంక తుమ్మ, మత్తడిగూడ గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. నాగాపూర్ వాగు ఉధృతితో రవాణా స్తంభించింది. లక్కారం, నవోదయ నగర్, కేబీ నగర్లో ఇండ్లలోకి నీరు చేరింది. హస్నాపూర్ ఎస్సీ వాడలో ఇళ్లల్లోకి వరద చేరడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం
గంగన్నపేట్ చెరువు పూర్తిగా నిండడంతో కట్ట తెగేపోయే ప్రమాదం ఏర్పడింది. గమనించిన రైతులు అధికారులు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యే రేఖానాయక్ ఆదేశాలతో పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకొని జేసీబీ ద్వారా మత్తడి కి గండి కొట్టడంతో ప్రమాదం తప్పింది. ఆర్ఐ జ్యోతి, గంగరాజు, రాజేశ్వర్ ఉన్నారు.మత్తడిగూడలో సోయం బాదికి చెందిన ఇంటి గోడ మంగళవారం కూలింది. వర్షాలకు గోడలు నాని కూలినట్లు బాధితుడు తెలిపారు. తన కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితుడు ప్రభుత్వం కోరాడు.
ఇంద్రవెల్లి జలదిగ్బంధం
ఇంద్రవెల్లి, జూలై12 : ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వద్ద ప్రధాన రహదారిపై నీరు నిలువడంతో జలాశయాన్ని తలపించింది. మండలకేంద్రంలోని మిలింద్ నగర్, వడ్డెర కాలనీ, ప్రబుద్ధ నగర్‌లోని పలు ఇళ్లల్లోకి వరద చేరడంతో నిత్యావసర సరుకులు తడిసిపోయాయి. మండలకేంద్రంలోని వాగు ఉధృతంగా ప్రవహించడంతో ట్రాన్స్ఫార్మర్ కూలిపోయింది. త్రివేణి సంగమం ప్రాజెక్టుతోపాటు ఏమాయికుంట చెరువులోకి భారీగా వరద చేరి మత్తడి దూకతున్నది. రెండు చెరువుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్ఐ సునీల్, పీఏసీఎస్ చైర్మన్ మారుతి పటేల్ డోంగ్రే, సర్పంచ్ కోరెంగా గాంధారి సుంకట్రావ్, ఉపసర్పంచ్ గణేశ్ టేహెరే, నాయకులు గ్రామాల్లో పర్యటించారు.
నార్నూర్,జూలై12:నార్నూర్,గాదిగూడ మం డలాల్లోని పలు చోట్ల బాహ్య ప్రపంచంతో సం బంధాలు తాత్కా లికంగా తెగిపోయాయి. బారిక్రావ్గూడ, కునికసా ఎస్సీగూడ, గోండుగూడ, దన్నుగూడ, పూన్నగూడ, చిత్తగూడ, ఉమ్రి, మారుగూడ సమీపంలోని వాగులు ఉప్పొంగుతున్నాయి. ఖడ్కి, లోకారి(కే), ఝరి, మేడిగూడ, సోనాపూర్, అర్జుని ప్రధాన రహదారిలోని కల్వర్టులపై నుంచి వరద ప్రవహించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. పంట పొలాల్లో వరద చేరింది. వర్షాలతో అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
బేల,జూలై 12 : సాంగిడి, బెదోడ , మణియార్‌పూర్, మాంగ్రూడ్లో పంట పొలాల్లోకి నీరు చేరింది. దహిగాం, మణియార్‌పూర్ శివారులోని వాగులపై నుంచి నీళ్లు ప్రవహించడంతో రాకపోకలు నిలిచాయి. 47.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.