బోథ్, నవంబర్ 25: 2023 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండనున్న వారిని ఓటరుగా నమోదు చేయించాలని బోథ్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి సూచించారు. బోథ్‌లోని రైతు వేదిక భవనంలో నియోజకవర్గంంలో తొమ్మిది మండలాల తహసీల్దార్లు, రాజకీయ పార్టీల నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడారు. ఈ నెల 26, 27 తేదీలతో పాటు డిసెంబర్ 3, 4 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. కొత్తగా ఓటరు నమోదుతో పాటు మార్పులు-చేర్పులు, సవరణల కోసం దరఖాస్తులు తీసుకుంటారన్నారు. పూర్తి వివరాలతో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అతిఖొద్దీన్, ఎన్నికల విభాగం డీటీ సూరజ్, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, బోథ్ పీఏఎసీఎస్ చైర్మన్ కే ప్రశాంత్, తహసీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఎంపీపీని అభినందించిన పీవో…
బోథ్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఇరువైపులా ఏర్పాటు చేసిన ఉద్యానవనాన్ని (గార్డెన్)చూసిన పీవో వరుణ్‌రెడ్డి ఎంపీపీ శ్రీనివాస్‌ను అభినందించారు. పూల మొక్కలు, చెట్లు, లాన్లో గడ్డి పెంపకం తీరుపై మెచ్చుకున్నారు. గిరిజనులకు ఐటీడీఏ తరపున ఉపాధి అవకాశాలు కల్పించాలని, గిరి వికాస్ కింద మంజూరైన బోరుబావుల తవ్వకం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ పీవోకు విన్నవించారు. తహసీల్దార్ కార్యాలయ మరమ్మతుకు రూ.20 లక్షలు మం జూరు చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.