ఎదులాపురం, నవంబర్ 16 : నిరంతరం కఠిన శిక్షణతో ఉద్యోగం వచ్చేదాకా కష్టపడాలని పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీటీసీ(పోలీసు శిక్షణ కేంద్రం)లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత దేహదారుఢ్య శిక్షణ శిబిరాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అభ్యర్థులకు నెల రోజులపాటు ఉదయం 6:30 నుంచి 8 గంటలు.., సాయంత్రం 4 నుంచి 5:30 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు.
ఇందులో మహిళా అభ్యర్థులు కూడా శిక్షణ తీసుకోవడం మంచి కార్యక్రమమని పేర్కొన్నారు. పురుషులకు 1600 మీటర్లు, మహిళలకు 800 మీటర్ల పరుగు, షాట్‌పుట్, లాంగ్ జంప్ లాంటి వాటిల్లో శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులందరూ 100 శాతం ఉత్తీర్ణత పొందేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, డీఎస్పీలు వీ ఉమేందర్, ఉమామహేశ్వరరావు, సీఐలు పీ సురేందర్, కే శ్రీధర్, జీ గంగాధర్, ఆర్ఐ సీఐ డీ వెంకటి, జీ వేణు, ఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.