ప్రజారోగ్యంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ఇందులో భాగంగా దవాఖానలను ఆధునీకరిస్తూ, అవసరమైన వసతులు కల్పిస్తున్నది. కాగా, క్షేత్రస్థాయిలో మరింత పకడ్బందీగా వైద్య సేవలందించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లాలోని 16 పీహెచ్‌సీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిని రాష్ట్ర వైద్యశాఖ కార్యాలయానికి అనుసంధానం చేయనుండగా, తద్వారా పర్యవేక్షణ పెరిగి ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందనున్నది.
-నిర్మల్, నవంబర్ 12(నమస్తే తెలంగాణ)
నిర్మల్, నవంబర్ 12(నమస్తే తెలంగాణ) : నిరుపేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా జిల్లాలోని 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులను నియమిస్తున్నది. ఎక్కువ సంఖ్యలో డాక్టర్లు ఉన్న కేంద్రాల నుంచి వైద్యులు లేని పీహెచ్‌సీలకు తాత్కాలిక ప్రాతిపదికన వారికి డిప్యూటేషన్లు ఇస్తూ వైద్య సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నది. ఇలా జిల్లాలోని 16 పీహెచ్‌సీల్లో డాక్టర్లు అందుబాటులో ఉండేలా చేశారు.
దీంతో పాటు ఇతర పారా మెడికల్ సిబ్బందిని కూడా సర్దుబాటు చేస్తూ అన్ని పీహెచ్‌సీల్లో సిబ్బంది పని చేసేలా చూస్తున్నారు. ఇప్పుడు మరో సరికొత్త చర్యకు శ్రీకారం చుట్టింది. ప్రతి ఆరోగ్య కేంద్రంలో అన్ని వైపులా సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇవి నేరుగా హైదరాబాద్‌లోని వైద్యారోగ్య శాఖ ప్ర ధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేయనున్నారు.
దీనిని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావ్ హైదరాబాద్‌లో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. దీంతో ఇకపై జిల్లా అధికారులే కాకుండా, రాష్ట్ర స్థాయిలోని ఉన్నతాధికారులు సైతం ఎప్పటికప్పుడు అన్ని పీహెచ్సీ కేంద్రాలను పర్యవేక్షించే వెసులుబాటు కలగనున్నది. ఇలా పకడ్బందీ పర్యవేక్షణతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడనున్నారు.
కొంతకాలంగా పీహెచ్‌సీల్లో ఓపీ సంఖ్య కూడా మెరుగుపడుతున్నది. సగటున ప్రతిరోజూ 70 నుంచి 100 మంది వరకు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో వస్తుండగా, ప్రసవాల సంఖ్య కూడా పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నార్మల్ డెలివరీల కోసం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్య సిబ్బంది కూడా సాధారణ ప్రసవాల కోసం ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని పీహెచ్‌సీల్లో గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 246 నార్మల్ డెలివరీలు చేయడం విశేషంగా చెప్పవచ్చు.
పీహెచ్‌సీల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించేందుకు ఇప్పటికే లైవ్ లొకేషన్, బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో పాటు ఇక సీసీ కెమెరాల అనుసంధాన ప్రక్రియ కూడా మరింత నిఘాను పెంచనున్నది. ఇక వైద్యులు, సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు రోగులకు అందుబాటులో ఉండే అవకాశం ఏర్పడనుంది. అలాగే అన్ని పీహెచ్‌సీలకు మందుల కొరత లేకుండా అవసరమైన మేరకు మందులను కూడా సరఫరా చేస్తున్నారు.
అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్త పరీక్షల కోసం నమూనాలను సేకరించి జిల్లా కేంద్రంలోని ప్రధానాసుపత్రిలో గల డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా పరీక్షలు జరుపుతున్నారు. దీని కోసం ప్రత్యేక వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మెడికల్ కాలేజీ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రత్యేక వైద్య నిపుణుల నియామకం పూర్తయ్యింది. ప్రస్తుతం జిల్లా కేంద్ర ప్రధానాసుపత్రిలో 22 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి వైద్య నిపుణులు విధుల్లో చేరి తమ సేవలను అందిస్తున్నారు.
అలాగే స్థానిక అయ్యప్ప ఆలయం సమీపంలో 350 పడకల దవాఖాన నిర్మాణం జరుగుతున్నది. ఇక్కడే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో విస్తృతంగా సేవలు అందుతున్నాయి. ఇక్కడి ప్రసూతి ఆసుపత్రిలో కలెక్టర్ ఆదేశాల మేరకు సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి పేద, మధ్య తరగతి రోగులకు అన్ని రకాల ఆధునిక వైద్యం ప్రభుత్వ పీహెచ్‌సీల్లోనూ, జిల్లా కేంద్రంతో పాటు ఖానాపూర్, భైంసా ఏరియాసుపత్రుల్లో కూడా అందుబాటులోకి వచ్చాయి.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. రెండు మూడు రోజుల్లో రా ష్ట్ర కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంకు వీటిని అనుసంధానించనున్నాం. ఈ కెమెరాల ద్వారా ప్రాథమిక స్థాయిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించే అవకాశం ఉంటుం ది. అలాగే వైద్యపరంగా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఈ కమాండ్ కంట్రోల్ రూం నుంచి నేరుగా పీహెచ్‌సీలతో ఎప్పటికప్పుడు మాట్లాడడానికి, అవసరమైన సూచనలు ఇచ్చేందుకు ఈ మానిటరింగ్ సిస్టం చాలా ఉపయోగ పడుతుంది. దీని ద్వారా రోగులకు నిపుణుల పర్యవేక్షణలో మరింత మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉంటుంది.
-డాక్టర్ ధన్‌రాజ్, డీఎంహెచ్‌వో ,నిర్మల్