ఎదులాపురం, మార్చి1: రాష్ట్ర ప్రభుత్వం మాతాశిశు సంరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా మహిళల్లో రక్తహీనత, బరువు తక్కువ ఉన్న చిన్నారులు, సరైన ఎదుగుదల లేని పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలకు నిత్యం ఆకుకూరలు, కాయగూరలతో రుచికరమైన భోజనం, కోడిగడ్డు, 200 గ్రాముల పాలు అందిస్తున్నది. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్రం పరిధిలోని ప్రభుత్వ టీచర్, సర్పంచ్/(కౌన్సిలర్), ఆవాసప్రాంత పెద్దలు, పిల్లల తల్లిదండ్రులతో మానిటరింగ్ కమిటీని నియమించింది. ఆదిలాబాద్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో 5ప్రాజెక్టు ఉన్నాయి. ఇందులో 1256 అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు, మహిళలకు సేవలు అందుతున్నాయి.
జిల్లాలో ఆదిలాబాద్, జైనథ్, బోథ్, ఉట్నూర్, నార్నూర్ ప్రాజెక్టుల పరిధిలో 1256 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 992, మినీ అంగన్వాడీ కేంద్రాలు 264 ఉన్నాయి. ఇందులో 6528 మంది గర్భిణులు, 6422 మంది బాలింతలు, 3నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 28046 మంది ఉన్నారు. ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 38,933 మంది ఉన్నారు. వీరందరికీ మధ్యాహ్న భోజనం, చిన్నారులకు బాలామృతం అందిస్తున్నారు. గర్భిణులు బాలింతలకు కలిపి నిత్యం ఒక్కొకరికి రూ.21 ఖర్చు అవుతుండగా, మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులకు మరో రూ.7 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. నిత్యం ప్రభుత్వ ఖజానాపై రూ.7,40,803 భారం పడుతున్నది. ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో లబ్ధిదారులకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో మోనూ రూపొందించింది. నాణ్యమైన విద్యతోపాటు మంచి పోషకాహారం అందిస్తుండడంతో కేంద్రాలకు వచ్చే గర్భిణులు, చిన్నారుల సంఖ్య పెరుగుతున్నది.
మహిళల్లో రక్తహీనత, బరువు తక్కువ, సరైన ఎదుగుదల లేని పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే ఉద్ధేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పోషణ్ అభియాన్ మిషన్ను ఏర్పాటు చేశాయి. అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది పోషణలోపం, బరువు తక్కువ కలిగిన చిన్నారులను గుర్తిస్తున్నారు. పర్యవేక్షణకు ప్రత్యేక కోఆర్డినేటర్లు , జిల్లా స్థాయిలో ఓ ప్రత్యేక అధికారితో పాటు మరో కోఆర్డినేటర్ సేవలు అందిస్తున్నారు. ప్రాజెక్టు లెవల్లో బ్లాక్ కోఆర్డినేటర్, మరో అసిస్టెంట్ అధికారి సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న జిల్లా కోఆర్డినేటర్ ఆయా ప్రాజెక్టుల్లో పనిచేసే బ్లాక్ కోఆర్డినేటర్, సీడీపీవోలకు శిక్షణ ఇచ్చారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన కోఆర్టినేటర్లు ప్రాజెక్టు లెవల్ అధికారులు సెక్టార్లో పనిచేస్తున్న పర్యవేక్షకులకు శిక్షణ టీచర్లకు అవగాహన కల్పిస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సంపూర్ణ ఆరోగ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఆరోగ్యలక్ష్మి పథకం మంచి ఫలితాలు ఇస్తున్నది. రుచికరమైన భోజనం, పోషకవిలువలు కలిగిన గుడ్లు, పాలు అందిస్తున్నాం. దీంతో కేంద్రాలకు వచ్చే వారి హాజరుశాతం పెరుగుతున్నది.
జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ఆదిలాబాద్