బోథ్, ఏప్రిల్ 21: మెగా వైద్య శిబిరాల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా బోథ్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం మెగా ఆరోగ్య మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వివిధ విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణులు శిబిరాలకు రావడంతో వ్యాధిగ్రస్తులను అక్కడిక్కడే గుర్తించే వీలు కలుగుతుందన్నారు. అవసరమైన వారికి సకాలంలో చికిత్స అందించే అవకాశం ఉంటుందని చెప్పారు.
బోథ్ ప్రాంతంలో ఆరోగ్య మేళా ఏర్పాటులో జిల్లావైద్యాధికారి నరేందర్ రాథోడ్, దవాఖాప సూపరింటెండెంట్ ఆర్ రవీంద్రప్రసాద్‌ను కలెక్టర్ అభినందించారు. సూపర్ స్పెషాలిటీ దవాఖానాలకు వెళ్లలేని వారికి ఆరోగ్య మేళాల ఏర్పాటుతో మేలు కలుగుతుందని డీఎంహెచ్‌వో తెలిపారు. మేళాకు బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్, ఇచ్చోడ, సిరికొండ, గుడిహత్నూర్ మండలాల నుంచి సుమారు 1250 మందికి పైగా ప్రజలు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు.
అవసరమున్న వారికి మందులు అందించారు. ముగ్గురికి తక్షణమే గుండె సంబంధిత శస్త్ర చికిత్స అవసరమని తేల్చారు. నిర్మల్‌కు చెందిన బీఎల్ నర్సింహా రెడ్డి (న్యూరాలజీ), డాక్టర్ జగన్నాథం (కార్డియాలజీ), యుగేశ్ (కిడ్నీ)లతో పాటు రిమ్స్ నుంచి 13 విభాగాలకు చెందిన వైద్యులు శిబిరానికి వచ్చి పరీక్షలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం శివరాజ్, సొనాల, నేరడిగొండ పీహెచ్‌సీల వైద్యులు కే నవీన్‌రెడ్డి, ఆనంద్‌కుమార్, జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి, సర్పంచ్ సురేందర్ యాదవ్, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.