నిర్మల్ టౌన్, మే 28 : కుభీర్ మండలంలోని రంజనితండాకు చెందిన జానకీరాం-కవితాబాయి దంపతులకు ముగ్గురు సంతానం. మొదటి కుమారుడు సచిన్, రెండో కుమారుడు సందీప్‌తో పాటు కూతురు యోగి తా ఉన్నారు. జానకీరాం-కవితకు గ్రామంలో ఉన్నపా టి వ్యవసాయ భూమి ఉంది. అందులో రోజంతా కష్టపడి పంటలు పండించేవారు. వచ్చిన ఆదాయంతో పిల్లలను చదివించారు. రెండో కుమారుడైన రాథోడ్ సందీప్ చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. మొదట పదో తరగతి వరకు భైంసా ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ వరంగల్ గురుకులంలో విద్యనభ్యసించాడు. ఇప్పుడు నిర్మల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
ఒకవైపు డిగ్రీ చదువుతూనే రోజువారీగా హైజంప్, లాంగ్‌జంప్, అథ్లెటిక్లో సందీప్ ప్రాక్టీస్ చేసేవాడు. ప్రతిరోజూ మెళకువలు నేర్చుకునేందుకే ప్రాధాన్యమిచ్చేవాడు. అమ్మనాన్నలు పేదరికంలో ఉండడంతో నిర్మల్‌లోని ఓ క్లబ్లో ఆఫీసు బాయ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి సమయంలో శుభకార్యాల్లో క్యాటరింగ్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. వచ్చిన డబ్బులతో త న అవసరాలు తీర్చుకుంటున్నాడు. ప్రభుత్వం ద్వా రా ఎలాంటి ప్రోత్సాహం లేకున్నా అథ్లెటిక్పై పట్టు సా ధిం చి గోల్డ్‌మెడల్ సాధించడం ప్రతిభకు నిదర్శనం.
రాథోడ్ సందీప్ క్రీడా ప్రతిభను గుర్తించిన రాష్ట్ర మం త్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. నిర్మల్ క్లబ్లో బ్యాడ్మింటన్ వేసవిశిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు సందీప్ సహకారం అందిస్తున్నాడు. అన్ని విధాల వారికి సహకారం అందిస్తూ అథ్లెటిక్లో విలువైన సలహాలు, సూచనలిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన పాఠశాల స్థాయి నుంచి సుమారు 20 చోట్ల వివిధ పోటీల్లో పాల్గొన్నాడు. అనేక బహుమతులను కూడా గెలుచుకున్నాడు. ఈ విద్యార్థి ప్రతిభను గుర్తించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు.
ఒకవైపు కుటుంబంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురవుతున్నా లక్ష్యం వైపు గురి పెట్టి హైజంప్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన విద్యార్థి స్ఫూర్తిని మంత్రి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. మరోవైపు నిర్మల్‌లో నిరుద్యోగ యువతి, యువకులకు శిక్షణ ఇస్తున్న పీఈటీలు కూడా సందీప్ ప్రతిభను గుర్తించి వారికి అన్ని విధాల ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. నిర్మల్ పీఈటీల సంఘం జిల్లా నాయకుడు భూమన్న ఆయనకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నాడు. ప్రభుత్వం గుర్తించి తనను ప్రోత్సహిస్తే భవిష్యత్‌లో రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని మంచి అథ్లెటిక్‌గా పేరు తెచ్చుకుంటానని యువకుడు విశ్వాసం వ్యక్తం చేశాడు.