వానకాలం సాగుకు రైతన్నలు సన్నద్ధం అవుతున్నారు. రోహిణి కార్తె ప్రవేశించడం, సీజన్‌కు ముందుగానే రుతుపవనాలు పలుకరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొనడం, అడపాదడపా అక్కడక్కడ చిరుజల్లులు కూడా పడుతుండడంతో వ్యవసాయ సామగ్రిని తయారు చేసుకుంటున్నారు. మృగశిర కార్తె వరకు దుక్కులు దున్నడం, పొరక ఏరడం, కాలబెట్టడం, ఎడ్లబండ్లలో సేంద్రియ ఎరువులు తరలించడం చేస్తారు. ఇప్పటికే దుకాణాల వద్ద విత్తనాల కోసం బారులుదీరడం కనిపిస్తున్నది.
కాగా.. ఈసారి రికార్డుస్థాయిలో ధర పలుకడంతో పత్తి వైపు అధిక మంది మొగ్గు చూపుతున్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులతో రైతన్నలు నష్టపోకుండా వ్యవసాయాధికారులు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మేలు రకం విత్తనాలు, ఎరువుల వాడకంలో మెళకువలు నేర్పిస్తున్నారు. అవసరమైన ఎరువులు, విత్తనాలను కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.
ఆదిలాబాద్, మే 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో పంటలు అధికంగా సాగు చేస్తారు. ప్రధానంగా వానకాలంలో పత్తి, సోయా, కంది, జొన్న, మినుము, పెసర.. యాసంగిలో శనగ, గోధుమ, జొ న్న, పల్లి వేస్తారు. రాష్ట్ర సర్కారు ప్రోత్సాహంతో యే టేటా సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. విత్తనాలు, ఎరువులు సకాలంలో ఇవ్వడం, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరంటు వంటి పథకాల అమలు, పంట ఉత్పత్తులను సక్రమంగా కొనుగోలు చేయడంతో రైతులు సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈసారి రుతు పవనాలు అనుకున్న సమయాని కంటే ముందుగానే ప్రవేశిస్తాయని వాతావర ణ శాఖ సూచించడంతో రైతులు విత్తనాలు వేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే భూములు దు క్కులు దున్నారు. మన వద్ద నల్లరేగడి నేలలు అధికంగా ఉండడంతో తేమ శాతం అధికంగా ఉం టుంది. రెండు మంచి వర్షాలు పడగానే జూన్ మొ దటి వారంలో రైతులు విత్తనాలు వేయడానికి సిద్ధం అవుతారు. ఇప్పటికే దుకాణాల వద్ద విత్తనాలు, ఎరువుల విక్రయాలు కొనసాగుతుండగా.. రైతులు అవసరమైనవి కొనుగోలు చేస్తున్నారు.
నకిలీ విత్తనాల వల్ల నష్టపోకుండా ఉండడానికి అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. సాగు, మేలు రకం విత్తనాలు, ఎరువుల వాడకంలో మెళకువలను వ్యవసాయ శాఖ అధికారులు రైతువేదికల్లో అవగాహన కల్పిస్తున్నారు. డీఏపీ ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి పీఎస్పీ (ఫాస్ఫరస్ సాలిబుల్ బ్యాక్టీరియా) విధానం ద్వారా భాస్వరం మొక్కకు ఏ మేరకు అవసరమవుతాయనే విషయాలు వివరిస్తున్నారు. సాగులో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో 5.71 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో పత్తి 3.95 లక్షల ఎకరాలు, సోయా 89 వేలు, కంది 61,750, జొన్న 4,500, ఇతర పంటలు 20,750 ఎకరాల్లో సాగవుతాయని పేర్కొంటున్నారు. ఇందుకు అవసరమైన 11.85 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు, 30 వేల క్వింటాళ్ల సోయా, 5 వేల క్వింటాళ్ల కంది, 500 క్వింటాళ్ల జొన్న విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు. సీజన్లో 95 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు.
నిర్మల్ జిల్లాలో 4.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 90 వేలు, మక్క 9 వేలు, పత్తి 2 లక్షలు, సోయాబీన్ 80 వేలు, కందులు 2,500, ఇతర పంటలు 38,500 ఎకరాల్లో సాగు కానున్నాయి. ఇందుకుగానూ 22,500 క్వింటాళ్ల వరి విత్తనాలు,720 క్వింటాళ్ల మక్క, 20 వేల క్వింటాళ్ల సోయా, 1500 క్వింటాళ్ల కందులు, 4.50 లక్షల విలువ చేసే పత్తి విత్తన బ్యాగులను అవసమరమవుతాయని అంచనా వేశారు. ఇందులో భాగంగా పంటల సాగుకు అవసరమయ్యే డీఏపీ 11 వేల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 10 వేలు, యూరియా 84 వేలు, ఫాస్ఫెట్ 1000 మెట్రిక్ టన్నులు అవసరమని అధికారులు గుర్తించారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా 4,51,778 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 3,37,374, పత్తి 55,534, కంది 44,722, పెసర 2,948, మినుములు 437, సోయా 1,754, ఇతర పంటలు 9,009 ఎకరాల్లో సాగు చేయనున్నారు. ఇందుకు వరి విత్తనాలు 13,883.5 క్వింటాళ్లు, పత్తి 7,64,748 విత్తన ప్యాకెట్లు, కంది 1,788.88 క్వింటాళ్లు, పెసర 117.92 క్వింటాళ్లు, మినుములు 21.85 క్వింటాళ్లు, సోయా 526.2 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనాలు వేస్తున్నారు.
వీటితోపాటు చిరుధాన్యాలు కూడా సాగవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. రాగులు 400 ఎకరాలు, కొర్రలు 2,600, సజ్జలు 800, సామలు 1,800, ఊదలు 1,080 ఎకరాల్లో మొత్తం 6,680 ఎకరాల్లో సాగు చేసేదుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం 149.60 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అధికారులు విత్తన ప్రణాళికలు తయారు చేశారు. ఇందుకు గానూ యూరియా 46 వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 23 వేలు, పొటాష్ 23 వేలు, సూపర్ ఫాస్ఫేట్ 23 వేలు, కాంప్లెక్స్ ఎరువులు 20 వేల మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనా వేశారు.

మంచిర్యాల జిల్లాలో 3.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నాయి. ఇందులో పత్తి 1,90,300 ఎకరాలు, వరి 1, 59,473, కందులు 12 వేలు, పెసర 1,590, మినుములు 305, 332 ఎకరాల్లో సోయా, మక్కజొన్న, జొన్న పంటలు సాగయ్యే అవకాశం ఉంది. మరో 21 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇందుకుగానూ 32,325 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని పేర్కొంటున్నారు.
ఇం దులో 31,892 క్వింటాళ్ల వరి ధాన్యం, 37.5 క్వింటాళ్ల సోయా, 243.5 క్వింటాళ్ల కందులు, 127.2 క్వింటాళ్ల పెసర, 24.4 క్వింటాళ్ల మినుములు, అలాగే 3,59,220 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరమవుతాయని పేర్కొంటున్నారు. 1,10,415 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతా యి. ఇందులో యూరియా 42,900 మెట్రిక్ టన్నులు, డీఏపీ 22,300, కాంప్లెక్స్ ఎరువులు 24వేలు, ఎంవోపీ 14,075, ఎస్ఎస్పీ 3,980, జింక్ సల్ఫేట్ 3,160 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయి.