మంచిర్యాల, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్‌పై ఏసీబీ విచారణ కొనసాగుతున్నది. ఈ నెల 14న ‘నమస్తే తెలంగాణ’లో ‘పెన్సిల్ రాత.. కోట్లలో మేత’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ శుక్రవారం సోదాలు చేశారు. ఈ క్రమంలో కొన్ని లావాదేవీలపై అనుమానం వచ్చిన అధికారులు అక్కడికి వచ్చిన వారిని ‘ఎందుకోసం వచ్చారు.
ఎంత చాలన్ కట్టారు. డాక్యుమెంట్ రైటర్‌కు ఎంత ఇచ్చారు. ఇంకెవరికైనా డబ్బులు ఇచ్చారా.’ అంటూ ఆరా తీశారు. ఎస్ఆర్వో కార్యాలయంలో పనిచేసే కొందరు ఉద్యోగులకు యూపీఐ ద్వారా (ఫోన్ పే, గూగుల్ పేలో) పెద్ద మొత్తంలో వచ్చిన డబ్బులపైనా ఆరా తీసినట్లు తెలిసింది. ముఖ్యంగా ఓ జూనియర్ అసిస్టెంట్ ఖాతాలోకి వచ్చిన రూ.70 వేల లావాదేవీలపై స్పష్టత కొరవడినట్లు సమాచారం.
ఆ డబ్బులు ఎవరు పంపారు… ఎందుకు పంపారు.. అన్న కోణంలోనూ ఏసీబీ అధికారులు ఆరా తీయగా, ఉద్యోగి నుంచి సరైన సమాచారం రానట్లు తెలిసింది. కాగా, కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగిన తీరుపై ఏసీబీ అధికారులకు అనుమానం రావడంతో శుక్రవారం రాత్రి సబ్ రిజిస్ట్రార్ ప్రియాంకరెడ్డి ఇంటికెళ్లి మరీ సోదాలు చేశారు. కానీ, అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలిసింది. కాగా, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు ఏసీబీ అధికారులు వచ్చారని తెలిసి ఎస్ఆర్వో కార్యాలయం చుట్టూ ఉన్న 33 మంది డాక్యుమెంట్ రైటర్లు సెటర్లు మూసేసి వెళ్లిపోయారు.
ఏసీబీ అధికారులు వచ్చిన సమయంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు అక్కడి నుంచి మెళ్లిగా జారుకున్నట్లు తెలిసింది. ఏసీబీ వచ్చిన సమయంలోనే డాక్యుమెంట్ రైటర్లు తాళాలు వేసుకొని ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని డాక్యుమెంట్లు చేసిన సమయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని సీసీ కెమెరాలు ఆఫ్ చేసినట్లు ఏసీబీ దృష్టికి వచ్చినట్లు సమాచారం. సీసీ కెమెరాలు ఎందుకు ఆఫ్ చేశారు.. సీసీ కెమెరాలు ఆఫ్ చేసిన డాక్యుమెంట్లు ఏమిటి అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయమై ఏసీబీ ఉన్నతాధికారులను వివరణ కోరగా రూ.70వేల లావాదేవీలపై అనుమానాలున్నాయని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు.