కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): అక్రమ సంపాదనకు అలవాటు పడి ప్రజలను లంచాల కోసం వేధిస్తున్న అధికారుల్లో ఏసీబీ దాడులు దడ పుట్టిస్తున్నాయి. వరుసగా జరుగుతున్న దాడుల్లో లంచాలు తీసుకున్న అధికారులు పట్టుబడుతున్నారు. ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. శనివారం జిల్లాలోని జైనూర్ మండలం పోచ్చంలొద్ది గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి తిరుపతి(తహసీల్దార్) తో పాటు కార్యదర్శి శేఖర్ రూ.12వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఒకేసారి ఇద్దరు అక్రమార్కులు ఏసీబీకి పట్టుబడడం ఇదే మొదటిసారి. ఉపాధి పనుల్లో నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ నుంచి రూ.12వేల లంచం తీసుకుంటున్న ఘటనలో తహసీల్దార్‌తో పాటు గ్రామకార్యదర్శి ఏసీబీకి చిక్కడం రెవెన్యూ శాఖలో సంచలనం రేపింది.
జిల్లాలో ఇటీవల జరిగిన దాడులు..
6 నెలల క్రితం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పని చేస్తున్న రాజ్యలక్ష్మి ఒకరికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.25వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జిల్లాలో నిర్మించిన జాతీయ రహదారికి సంబంధించి భూ నష్టపరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టి దాదాపు రూ.4కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. దహేగాం మండలంలో 2013లో అప్పటి తహసీల్దార్ అమృతసాగర్, 2016లో మరో తహసీల్దార్ విశ్వంబర్ లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.
5 నెలల క్రితం దహేగాం వ్యవసాయాధికారి వంశీకృష్ణ ఫర్టిలైజర్ రెన్యూవల్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వివిధ పనుల కోసం అధికారులను సంప్రదించే ప్రజలను పీడిస్తూ పనులు చేయడంలో కాలయాపన చేస్తున్నారు. అక్రమ సంపాదనకు అలవాటు పడి లంచం చెల్లించనిదే పనులు చేయబోమనే రీతిలో కొందరు అధికారులు వ్యవహరిస్తుండడంతో బాధితులు గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో ఇలా వరుసగా జరుగుతున్న ఏసీబీ దాడులు అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.