తాండూర్ : నకిలీ, అనుమతిలేని పత్తి విత్తనాలు ( Fake cotton seeds ) , నిషేదిత గడ్డి మందు లాంటివి ఎవరు విక్రయించినా, వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్( DCP Bhasker ) అన్నారు. తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ నకిలీ పత్తి విత్తనాల కేసుకు సంబంధించిన వివరాలను బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
బోయపల్లి బోర్డు జాతీయ రహదారి సమీపంలో ఆటోలో బెల్లంపల్లి నుంచి తాండూర్ కు నకిలీ పత్తి విత్తనాలను డంపు చేస్తున్నారనే సమాచారంతో తాండూర్ ఎస్సై కే ప్రసాద్, వ్యవసాయాధికారిణి సుష్మా, సిబ్బందితో కలిసి వెళ్లి తనిఖీ చేయగా ఆటోలో నకిలీ పత్తి విత్తనాలు లభ్యమైనట్లు గుర్తించారని తెలిపారు. రూ. 3లక్షలు విలువగల 150 కేజీల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
భీమిని మండలం నారాయణపూర్ గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తు బోయపల్లి బోర్డు గ్రామంలో ఉంటున్న వూస సుబ్బారావు, తాండూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒగరి సమ్మయ్య, తాండూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ మగ్ధూంను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇద్దరు కొనుగోలుదారులు నకిలీ పత్తి విత్తనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా గుంటుపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసి తీసుకువచ్చినట్లు డీసీపీ వివరించారు.
గ్రామాల్లో ఎక్కడైనా నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లుగానీ అమ్ముతున్నట్లుగాని సమాచారం తెలిస్తే తెలియజేయాలని వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమావేశంలో తాండూర్ సీఐ దేవయ్య, ఎస్సై ప్రసాద్, పోలీసు సిబ్బంది, తాండూర్ మండల వ్యవసాయాధికారిని సుష్మ తదితరులు పాల్గొన్నారు.