నిర్మల్, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో 46 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 19,107 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు. ఇందులో 17,141 మంది పట్టభద్రులు కాగా, 1,966 మంది ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. ఇప్పటివరకు 149 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయన్నారు. ఈ నెల 26న జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఎన్నికల సామగ్రిని అధికారులకు అందజేస్తామన్నారు. అలాగే ఈనెల 23 నుంచి 26 వరకు ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తామని తెలిపారు. ఓటర్లకు ఓటు వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 24,25 తేదీల్లో స్థానిక ఆర్డీవో కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఇప్పటికే పలు కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే విధులు నిర్వహించే అధికారులకు మాస్టర్ ట్రెయినర్లతో శిక్షణ ఇప్పించామని తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా యాప్‌ను తయారు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. గడువులోగా సీఎంఆర్ బియ్యాన్ని ఇవ్వని ఎనిమిది మంది రైస్ మిల్లర్లను గుర్తించి, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశామని తెలిపారు. పరిహారం చెల్లించని మిల్లర్ల నుంచి దాదాపు 30 ఎకరాల భూమిని, ఇతర ఆస్తులపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని వర్తింపజేసి సదరు ఆస్తులను బ్లాక్ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే జిల్లాలో బియ్యం అక్రమ రవాణా జరగకుండా అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాటు చేశామన్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో ప్రత్యేకంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న బాలశక్తి కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 20 వేల మంది విద్యార్థులకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య కార్డులను తయారు చేశామన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, పౌర సంబంధాల అధికారి విష్ణువర్ధన్, డీఎస్వో కిరణ్‌కుమార్, డీఎం వేణుగోపాల్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్‌రావు, ఈడీఎం నదీం పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 22 : ఎమ్మెల్సీ ఎన్నికల విధులపై తప్పని సరిగా అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. మాస్టర్ ట్రెయినర్లు అధికారులకు ఎన్నికల విధులపై శిక్షణ ఇచ్చారు.