కొనసాగుతున్న నాట్లు
తాండూర్ మండలంలో 4500 ఎకరాల్లో సాగు
యాజమాన్య పద్ధతులు పాటించాలి
వ్యవసాయాధికారుల సూచన
తాండూర్, ఆగస్టు 29 : తాండూర్ మండలంలో వరి సాగు జోరందుకున్నది. ఇప్పటికే బోర్లు, బావులు, చెరువుల కింద సాగు చేసే రైతులు వరి నాట్లు పూర్తి చేశారు. మరి కొన్ని చోట్ల ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తాండూర్ మండలంలో సుమారు 4500 ఎకరాల్లో వరి సాగవుతున్నది. రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
కలుపు నివారణకు ముందస్తు చర్యలు..
కలుపు మొక్కలు పోయేలా దుక్కి దున్ని మడులను తయారు చేసుకోవాలి. కలుపు మెక్కలు భూమిలో కలిసిపోయేలా దున్నితే అవి కుళ్లిపోయి ఎరువుగా ఉపయోగపడతాయి. ఇటీవల చాలా మంది రైతులు జనుము, జీలుగ, వంటి పచ్చిరొట్ట పైర్లను వేసుకుని 30 రోజుల తర్వాత భూమిలో కలియదున్నుతున్నారు. దీని వల్ల పంటకు అవసరమైన పోషకాలు లభిస్తాయి.
దుక్కిలోనే మొదటి దఫా ఎరువులు..
కలియ దున్నేటప్పుడు ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పెట్ వేసుకుంటే త్వరగా భూమిలో కలిసిపోతున్నది. నాటు వేసే ముందు కాంప్లెక్స్ ఎరువులతో పాటు జింక్, భాస్వరం ఎరువులను ఒకేసారి కాకుండా 2-3 రోజుల తేడాతో వేయాలి. 4-6 ఆకులు కలిగిన పైరు నా టు వేసేందుకు అనుకూలంగా ఉంటుంది. మడులను తయారుచేసుకుని 2-3 సెంటీమీటర్ల లోతు లో నాటితే మంచిది. సాధ్యమైనంత వరకు లేత నారు నాటుకోవాలి.
కాలిబాటలు తప్పనిసరి..
నాట్లు వేసేటప్పుడు, వేసిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల చొప్పున కాలిబాటలు తీస్తే పైరుకు గాలి, వెలుతురు బాగా తగులుతాయి. చీడపీడలు, కలుపు నివారణకు మం దులు పిచికారీ, పైరు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించడం తేలిక అవుతుంది.
నీటి యాజమాన్య పద్ధతులు..
నీటి యాజమాన్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిలకలు సకాలంలో వచ్చి దిగుబడి బాగా ఉంటుంది. నాటువేసినప్పటి నుంచి 20 రోజుల పాటు పొలంలో పలుచగా నీరు ఉంచాలి. పొలంలో నీరు తగిన మోతాదులో ఉంటే సుడిదోమ, లద్దెపురుగుల తాకిడి ఉండదు. ఎరువులు వేసేటప్పుడు పొలంలో నీరు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు..
వరి సాగులో రైతులు యాజమాన్య పద్ధతులు కచ్చితంగా పాటించాలి. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలి. పొలంలో దమ్ము చేసేటప్పుడు, వరినాట్లు వేసేటప్పుడు మెళకువలు పాటించాలి. కాలిబాటలు పక్కాగా ఉండాలి. ప్రస్తుతం వరి నాట్ల సీజన్ మొదలైంది. సందేహాల నివృత్తికి వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చు.
-జీ కిరణ్మయి, మండల వ్యవసాయాధికారి, తాండూర్