మంచిర్యాల మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లు
మంచిర్యాలటౌన్, ఆగస్టు 28: మంచిర్యాల పట్టణ ప్రజలకు మెరుగైన సేవలందించాలని మున్సిపల్ అధికారులకు కౌన్సిలర్లు సూచించారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్మన్ పెంట రాజయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు సుధామల్ల హరికృష్ణ, గాదెసత్యం, వేములపల్లి సంజీవ్, మాదంశెట్టి సత్యనారాయణ, మినాజ్, పోరెడ్డి రాజు, తదితరులు మాట్లాడుతూ టీఎస్‌బీపాస్ పేరిట అనుమతులు లేని, అక్రమంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాలను కూల్చుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని కౌన్సిలర్లు ముక్త కంఠంతో పేర్కొన్నారు. పట్టణంలో వీధి దీపాల నిర్వహణలో విఫలమవుతున్న కాంట్రాక్టర్ స్థానంలో మున్సిపల్ విద్యుత్ కార్మికులకు అప్పగించాలని సూచించారు. వీధిదీపాల సామగ్రిని సైతం నేరుగా కొని బిల్లులను కాంట్రాక్టర్‌కు ఇచ్చే బిల్లులోనుంచి తీసుకోవాలని నిర్ణయించారు. పట్టణంలో వీధికుక్కల బెడద, దోమల బెడద ఎక్కువగా ఉందని, ఈ విషయాల్లో తక్షణమే చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు సురేశ్‌బల్దవా, అంకం నరేశ్ కోరారు. 29వ వార్డు కౌన్సిలర్ చైతన్యరెడ్డి మాట్లాడుతూ తమ వార్డు హైటెక్ సిటీలో చాలా సమస్యలు రాజ్యమేలుతున్నాయని, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాన్ని కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేసి వెళ్లాడని, చేసిన పనుల్లో నాణ్యత లేకుండా ఉందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, 100 ఫీట్ల రోడ్లులో చెత్తాచెదారాన్ని నింపుతున్నారని తెలిపారు. సెకండ్‌ఫేజ్ హైటెక్ కాలనీ లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కున్న వారికి ఇంటి నిర్మాణ అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. హరితహారం మొక్కల ట్రీగార్డులు ఇవ్వలేదని కౌన్సిలర్లు ప్రశ్నించారు. అనంతరం ఎజెండాలోని అంశాలను కౌన్సిల్ ఆమోదించింది.
కమిషనర్‌కు శుభాకాంక్షలు
బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ ఎస్ బాలకృష్ణకు మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి స్వాగత శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలందించి మంచి అధికారిగా పేరుతెచ్చుకోవాలనిన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
పారిశుధ్య పనుల నిర్వహణపై చర్చ
దండేపల్లి(లక్షెట్టిపేట రూరల్), ఆగస్టు 28: లక్షెట్టిపేట సాధారణ మున్సిపల్ సమావేశం శనివారం మున్సిపాలిటీ చైర్మన్ నల్మాసు కాంతయ్య అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాట్లపై చర్చించారు. పారిశుధ్య నిర్వహణ ఆటోలను నడిపేందుకు 8 మంది కార్మికులకు డ్రైవింగ్ శిక్షణను ఆర్టీవో కార్యాలయం ద్వారా ఇవ్వడానికి ఆమోదం తెలిపారు. గోదావరి రోడ్డులో డంప్ యార్డ్, పట్టణ ప్రకృతి వనానికి కేటాయించిన స్థలంలో ప్రహరీ నిర్మాణానికి సభ్యులు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్‌గౌడ్, కమిషనర్ ఆకుల వెంకటేశ్, మేనేజర్ శ్రీహరి, ఏఈ శృతి, సిబ్బంది ఉన్నారు.