సోమవారం 30 మార్చి 2020
Adilabad - Feb 19, 2020 , 23:39:06

పట్టణాలకు కొత్త అందాలు

పట్టణాలకు కొత్త అందాలు


ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : ప్రభుత్వం ఈనెల 24 నుంచి నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాలు కొత్త అందాలను సంతరించుకోనున్నాయి. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా పట్టణం పరిశుభ్రంగా తయారవడంతో పాటు పచ్చదనం సంతరించుకోనున్నది. ఈ కార్యక్రమ నిర్వహణలో భాగంగా  వార్డుల వారీగా ప్రణాళికలు తయారు చేస్తారు. ప్రతి వార్డుకూ ప్రత్యేక అధికారులను నియమించి స్థానిక అవసరాలను గుర్తిస్తారు. పట్టణంలో కనీసం ఉండాల్సిన  పౌర సదుపాయాలను గు ర్తించి వాటి అమలుకు చర్యలు తీసుకుంటారు. మూడు నెలల్లో సామూహిక మరుగుదొడ్లను నిర్మించడంతో పాటు ఎనిమిది నెలల్లో విద్యుత్‌ సమస్యలను పరిష్కరిస్తారు. ఈ కార్యక్రమం నిర్వహణతో పట్టణ ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడడమే కాకుండా చాలా రోజుల నుంచి ఉన్న స మస్యలు కూడా పరిష్కారం కానున్నాయి. 


ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో 49 వార్డులు ఉన్నాయి. గతంలో 36 వార్డులు ఉండగా పునర్విభజనలో భాగంగా వార్డుల సంఖ్య పెరిగింది. ఆదిలాబాద్‌ పట్టణానికి సమపంలో ఉన్న పలు ప్రాంతాలు సైతం మున్సిపాలిటీలో విలీ నం అయ్యాయి. దీంతో 13 వార్డులు పెరిగాయి. మున్సిపల్‌ పరిధి పెద్దగా ఉండడంతో పరిశుభ్రత, పచ్చదనం లాంటి కార్యక్రమాల నిర్వహణ మెరుగపడాల్సి ఉన్నది. పట్టణంలో పలు వార్డులతో పాటు శివారు ప్రాంతాల వార్డుల్లో నివసించే ప్రజలకు పౌరసదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టనున్న పట్టణ ప్రగతి కార్యక్రమం ఎంతో ఉపయోగపడనుంది. ఈనెల 24 నుంచి పది రోజుల పాటు జిల్లాలో పట్టణ ప్రగతి కార్యక్రమం అమలు కానున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌లో అధికారులు, మున్సిపల్‌ చైర్మన్లతో సదస్సు ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. ఈ మేరకు అధికారులు ఈనెల 24 నుంచి ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని అన్ని వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ద్వారా ఆదిలాబాద్‌ పట్టణం కొత్త అందాలను సంతరించుకోనుంది. 


పక్కాగా అభివృద్ధి ప్రణాళికలు.. 

పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మున్సిపల్‌ పరిధిలోని వార్డుల్లో పరిశుభ్రత నెలకొనడంతో పాటు పచ్చదనం సంతరించుకోనున్నాయి. కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీల్లోని వార్డుల వారీగా పట్టణ ప్రగతి ప్రణాళికలను తయారు చేసుకొని ఇందుకు అనుగుణంగా పనులు చేపడుతారు. పట్టణానికి వార్షిక, పంచవర్ష ప్రణాళికలను కూడా తయారు చేస్తారు. కౌన్సిలర్లు, కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు ఈ ప్రణాళిక తయారీలో భాగస్వాములు అవుతారు. పట్టణాల్లో ఉండాల్సిన కనీస పౌరసదుపాయాలను గుర్తించి వాటిని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటారు. మురికి కాల్వలు శుభ్రపర్చడంతో, చెత్తా చెదారాన్ని తొలగించడం, తుమ్మచెట్లను తీసివేస్తారు. పట్టణాల్లో ప్రజలకు అవసరమైన పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలను సేకరిస్తారు. జనాలకు ఉపయోగపడే విధంగా ఎక్కడెక్కడ వీటిని నిర్మించాలో గుర్తించి మూడు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారు.  ప్రతి వార్డుకూ ప్రత్యేక అధికారిని నియమించి వార్డుల్లో పనులు, ఇతర సమస్యలను పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకుంటారు. పట్టణాల్లో ప్రమాదకరంగా ఉన్న వంగిన, తుప్పుపట్టిన, రోడ్ల మధ్యలో ఉన్న కరెంటు స్తంభాలను కూడా తొలగిస్తారు. వేలాడుతున్న విద్యుత్‌ వైర్లను సరిచేయడంతో పాటు పుట్‌పాత్‌లపై ఉన్న ట్రాన్స్‌ఫారాలను తొలగిస్తారు. ఇప్పటి నుంచి ఎనిమిది నెలల్లో విద్యుత్‌ పనులను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. 


పచ్చదనం పరుచుకునేలా చర్యలు.. 

పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కల పెంపకాన్ని చేపట్టారు. వీటి సంరక్షణను స ర్పంచులకు అప్పగించారు. పట్టణప్రగతిలో భాగంగా పట్టణంలో పచ్చదనం సంతరించుకునేలా చర్యలు తీసుకుంటారు. పట్టణాల్లో అవసరమైన నర్సరీలను ఏర్పాటు చేస్తారు. స్థలాలు లేనిపక్షంలో పరిసర ప్రాంతాల్లో నర్సరీల పెంపకం చేపడుతారు. పట్టణంలో ఆయా వార్డుల్లో నాటిన మొక్కల్లో 85 శాతం బతికించాల్సిన బాధ్యత కౌన్సిలర్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇండ్ల నుంచి చెత్తసేకరణకు తడి, పొడి చెత్త బుట్టలను సమకూర్చడంతో పాటు అవసరమైన వాహనాలను సమకూరుస్తారు. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో పట్టణప్రగతి కార్యక్రమం ద్వారా వార్డులు పరిశుభ్రంగా మారి కొత్త రూపును సంతరించుకోనున్నాయి.  పట్టణం మరింత సుందరీకరణగా తయారు అవుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


logo