బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Jan 23, 2020 , 00:24:15

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం
  • -స్ట్రాంగ్‌రూమ్‌కు చేరిన బాక్సులు
  • -25న ఓట్ల లెక్కింపు

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకి బుధవారం పోలింగ్‌ ముగియగా బ్యాలెట్‌ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. పట్టణంలో 49 వార్డులు ఉండగా 286 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరి భవితవ్యం ఈ నెల 25న తేలిపోనున్నది. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను జిల్లా కేంద్రంలోని టీటీడీసీకి తరలించారు. అక్కడే కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. భద్రతను ఎస్పీ విష్ణువారియర్‌ పర్యవేక్షిస్తున్నారు.

- ఆదిలాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి


ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకి బుధవారం పోలింగ్‌ ముగియగా పోటీలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైంది. మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డులు ఉండగా టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల అభ్యర్థులు అన్ని వార్డుల్లో పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌, ఎంఐఎం, ఇండిపెండెంట్‌లతో కలిపి మొత్తం 286 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 14న నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే 15 నుంచి వారం రోజుల పాటు అభ్యర్థులు తాము పోటీ చేస్తున్న వార్డుల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో కలిసి వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. మైకులు, వాల్‌పోస్టర్‌లు, తమ గుర్తులతో కూడిన పత్రాలతో ఓటును అభ్యర్థించారు. ర్యాలీలు, రోడ్‌షోలతో పాటు ఇంటింటా ప్రచారం చేపట్టారు. మున్సిపల్‌ పరిధిలో మిగితా పార్టీల కన్నా టీఆర్‌ఎస్‌ ప్రచారంలో ముందంజలో నిలిచింది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ లోక భూమారెడ్డి, ఆదిలాబాద్‌, బోథ్‌ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపురావు, మాజీ ఎంపీ నగేశ్‌ అన్ని వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టారు.


25న కౌంటింగ్‌

మున్సిపల్‌ పరిధిలో 49 వార్డులకు బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. పలు వార్డుల్లో 4 నుంచి 10 వరకు అభ్యర్థులు పోటీలో నిలిచారు. దీంతో దాదాపు 70.05 శాతం పోలింగ్‌ నమోదైంది. 49 వార్డులకు చెందిన ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేశారు. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైంది. పోలింగ్‌ ముగిసిన అనంతరం పోలింగ్‌ సిబ్బంది టీటీడీసీకి తీసుకువచ్చి ఎన్నికల అధికారులకు అప్పగించారు. అధికారులు చేపట్టిన పకడ్బందీ చర్యల కారణంగా మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రశాంతంగా ముగిశాయి. 49 వార్డులకు చెందిన బ్యాలెట్‌ బాక్స్‌లను టీటీడీసీల స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపర్చారు. ఈ నెల 25న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానున్నది. ఈ రోజు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బ్యాలెట్‌ పేపర్‌లను ఉపయోగించడంతో ఆరోజు మధ్యాహ్నం తర్వాత ఫలితాలు వెలువడనున్నాయి.logo